కరాచి : పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ ఆ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. అప్పట్లో ఇంజమామ్ పాక్ జట్టుకు ఆణిముత్యంలా దొరికాడంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఇంజమామ్‌ను పాక్ వివ్ రిచర్డ్స్‌గా పోలుస్తారని.. హెల్మెట్ లేకుండానే తన బ్యాటింగ్‌తో బౌలర్లపై విరుచుకుపడుతూ ఎన్నోసార్లు మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడంటూ సక్లయిన్ ముస్తాక్ తన యూట్యుబ్ చానెల్‌లో చెప్పుకొచ్చాడు.
సక్లయిన్ మాట్లాడుతూ.. ' ఇంజమామ్ జట్టులోకి వచ్చినప్పుడు నాకు బాగా గుర్తుంది. తనకు వచ్చిన మొదటి అవకాశంలోనే తనేంటో నిరూపించుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే అరవీర భయంకరమైన బౌలర్లు కలిగిన విండీస్ టీమ్‌కు భయపడకుండా తలకు హెల్మెట్ లేకుండానే బ్యాటింగ్‌కు దిగి ప్రంట్ పుట్ షాట్స్‌తో బౌలర్లపై విరుచుకుపడిన తీరు నేను అంత తొందరగా మరిచిపోను. అయితే ఇంజమామ్ జట్టులోకి వచ్చేసరికి ఇమ్రాన్‌ఖాన్ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో ఇంజమామ్‌ను ఒకసారి పరీక్షిద్దామని ఇమ్రాన్ అప్పటి జట్టు బౌలర్లైన వసీమ్ అక్రమ్, వకార్ యునీస్‌లను కోరాడు. ఈ ఇద్దరు బౌలర్లు తమ పేస్ బౌలింగ్‌తో విరుచుకుపడుతుంటే ఇంజమామ్ మాత్రం వారి బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్న తీరు ఇమ్రాన్‌ను ఆకట్టుకుంది. దీంతో విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఇంజమామ్ ఫ్రంట్ ఫుట్, కవర్ డ్రైవ్, కట్ షాట్‌లు ఆడుతూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.(స్మిత్ కేవలం టెస్టులకే కానీ కింగ్ కోహ్లి..)
అతని ఆటతీరుకు ముచ్చటపడిన పాక్ అభిమానులు ఇంజూను పాక్ వివ్ రిచర్డ్స్‌గా అభివర్ణించారు. విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ కూడా ప్రత్యర్థి బౌలర్లకు ఏమ్రాం అవకాశం ఉండకుండా తన ఫ్రంట్ ఫుట్ షాట్లతో విరుచుకుపడేవాడు. ఇంజమామ్ మైదానం ఆవల, బయట ఎంత నెమ్మదిగా కదిలినా ఒక్కసారి బ్యాట్ పడితే కచ్చితమైన ఫుట్‌వర్క్‌తో షాట్లు ఆడేవాడు. నేను ఇంజమామ్‌తో కలిసి చాలా మ్యాచ్‌లు ఆడేవాడిని. నెట్స్‌లో ప్రాక్టీస్ సమయంలో తనను స్టంప్ అవుట్ చేసే అవకాశం ఇచ్చేవాడు కాదు. అందుకే అతన్ని మేం ముద్దుగా గేమ్ చేంజర్, మ్యాచ్ విన్నర్ అనేవాళ్లం' అంటూ సక్లయిన్ చెప్పుకొచ్చాడు. పాక్ అత్యుత్తమ స్పిన్నర్‌గా పేరు పొందిన సక్లయిన్ ముస్తాక్ జట్టు తరపున 49 టెస్టులు, 169 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment