విండీస్ వన్డే జట్టు సారధి షాయ్ హోప్ పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, విండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ పేరిట ఉన్న ఓ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా (114 ఇన్నింగ్స్‌లో) 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్, వివ్ రిచర్డ్స్‌లతో కలిసి సంయుక్తంగా మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఇంగ్లండ్‌తో నిన్న (డిసెంబర్ 3) జరిగిన తొలి వన్డేల్లో అజేయ మెరుపు శతకంతో (83 బంతుల్లో 109 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడిన హోప్ ఈ ఘనతను సాధించాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా ఈ మార్కును తాకిన రికార్డు పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ పేరిట ఉంది. బాబర్ కేవలం 97 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. బాబర్ తర్వాత ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హషీమ్ ఆమ్లా ఉన్నాడు. ఆమ్లా 101 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించాడు.
ఇదిలా ఉంటే, స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. షాయ్ హోప్ సూపర్ సెంచరీతో విండీస్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌట్ కాగా.. విండీస్ మరో ఏడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బ్రూక్ (72 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాల్ట్ (45), క్రాలే (48), సామ్ కర్రన్ (28), బ్రైడన్ కార్స్ (31 నాటౌట్) పర్వాలేదనిపించగా.. విండీస్ ఇన్నింగ్స్‌లో హోప్‌తో పాటు అలిక్ అథనాజ్ (66), రొమారియో షెపర్డ్ (49), బ్రాండన్ కింగ్ (35), షిమ్రోన్ హెట్‌మైర్ (32) రాణించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 6న జరుగనుంది. ఇంగ్లండ్ జట్టు ఈ పర్యటనలో 3 వన్డేల సిరీస్‌తో పాటు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment