
వెస్టిండీస్ వన్డే జట్టు కెప్టెన్ షాయ్ హోప్ గత కొంతకాలంగా భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో (2019-2023) అతను వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరించాడు. వరల్డ్ క్లాస్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, బాబర్ ఆజమ్‌లను సైతం అధిగమించాడు. 2019 వన్డే వరల్డ్‌కప్ నుంచి నిన్నటి వరల్డ్‌కప్-2023 క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల వరకు తీసుకుంటే.. హోప్ 46 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 2021 పరుగులు చేశాడు. కోహ్లి, బాబర్ ఆజమ్‌లు సైతం ఈ మధ్యకాలంలో అన్ని పరుగులు చేయలేదు.
కోహ్లి 37 ఇన్నింగ్స్‌ల్లో 1612 పరుగులు చేస్తే.. బాబర్ ఆజమ్ 28 ఇన్నింగ్స్‌ల్లో 1876 పరుగులు చేశాడు. 2019-2023 జూన్ మధ్యకాలంలో హోప్ తర్వాత బాబర్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. వీరి తర్వాత పపువా న్యూ గినియా బ్యాటర్ అస్సద్ వాలా (47 ఇన్నింగ్స్‌ల్లో 1620 పరుగులు) మూడో స్థానంలో, విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో, నమీబియా క్రికెటర్ గెర్హార్డ్ ఎరాస్మస్ (38 ఇన్నింగ్స్‌ల్లో 1577 పరుగులు) ఐదో స్థానంలో నిలిచారు.
ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా నిన్న (జూన్ 18) యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో షాయ్ హోప్ (54) సహా జాన్సన్ ఛార్లెస్ (66), రోప్టన్ ఛేజ్ (55), జేసన్ హోల్డర్ (56), నికోలస్ పూరన్ (43) రాణించడంతో విండీస్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ వీరంతా రాణించడంతో 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం ఛేదనలో యూఎస్‌ఏ 7 వికెట్లు కోల్పోయి 258 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. గజానంద్ సింగ్ (101 నాటౌట్) వీరోచిత శతకంతో పోరాడి విండీస్‌కు అంత సులువుగా విజయాన్ని దక్కనీయ లేదు. అతనికి ఆరోన్ జోన్స్ (23), షయాన్ జహంగీర్ (39), నోస్‌తుష్ కెంజిగే (34) సహకరించారు. విండీస్ బౌలర్లలో కైల్ మేయర్స్, అల్జరీ జోసఫ్ తలో 2 వికెట్లు, జేసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, వన్డే వరల్డ్‌కప్‌లో బెర్తు కోసం విండీస్.. మరో 9 జట్లతో కలిసి వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో తలపడుతున్న విషయం తెలిసిందే.