WI VS ENG 1st ODI: శతక్కొట్టిన హోప్‌.. విండీస్‌ రికార్డు విజయం | WI VS ENG 1st ODI: Shai Hope Slams Hundred, WI Completes Its Second Highest Successful Run Chase | Sakshi
Sakshi News home page

WI VS ENG 1st ODI: శతక్కొట్టిన హోప్‌.. విండీస్‌ రికార్డు విజయం

Published Mon, Dec 4 2023 9:35 AM | Last Updated on Mon, Dec 4 2023 12:52 PM

WI VS ENG 1st ODI: Shai Hope Slams Hundred, WI Completes Its Second Highest Successful Run Chase - Sakshi

వన్డే క్రికెట్‌లో వెస్టిండీస్ తమ రెండో అత్యుత్తమ లక్ష్య ఛేదనను నమోదు చేసింది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో నిన్న (డిసెంబర్‌ 3) జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్‌ 326 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. వన్డే క్రికెట్‌లో విండీస్‌ అత్యుత్తమ లక్ష్యఛేదన రికార్డు 328 పరుగులుగా ఉంది. 2019లో ఐర్లాండ్‌పై విండీస్‌ ఈ ఫీట్‌ను (47.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి) సాధించింది. 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేక​పోయిన విండీస్‌కు తదనంతరం దక్కిన తొలి విజయం ఇదే కావడం విశేషం.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులు చేసి ఆలౌట్‌ కాగా.. విండీస్‌ మరో ఏడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

రాణించిన బ్రూక్‌..
మిడిలార్డర్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ కీలక ఇన్నింగ్స్‌తో (72 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఇంగ్లండ్‌ 300 పరుగుల మార్కును దాటగలిగింది. బ్రూక్‌తో పాటు ఫిలిప్‌ సాల్ట్‌ (45), జాక్‌ క్రాలే (48), సామ్‌ కర్రన్‌ (28), బ్రైడన్‌ కార్స్‌ (31 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ (3) నిరాశపరిచాడు. విండీస్‌ బౌలర్లలో రొమారియో షెపర్డ్‌, గుడకేశ్‌ మోటీ, ఒషేన్‌ థామస్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్‌, యానిక్‌ కారియా చెరో వికెట్‌ దక్కించుకున్నారు. 

శతక్కొట్టిన హోప్‌..
326 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్‌.. షాయ్‌ హోప్‌ శతక్కొట్టడంతో (83 బంతుల్లో 109 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్సర్లు)  48.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హోప్‌తో పాటు అలిక్‌ అథనాజ్‌ (66), రొమారియో షెపర్డ్‌ (49) రాణించగా.. బ్రాండన్‌ కింగ్‌ (35), షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అట్కిన్సన్‌, రెహాన్‌ అహ్మద్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్‌ కార్స్‌, లివింగ్‌స్టోన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఇరు జట్ల మధ్య​ రెండో వన్డే డిసెంబర్‌ 6న జరుగనుంది. ఇంగ్లండ్‌ జట్లు ఈ పర్యటనలో 3 వన్డేల సిరీస్‌తో పాటు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కూడా ఆడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement