
వెస్టిండీస్ క్రికెట్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. వెస్టిండీస్ టెస్టు జట్టు కెప్టెన్సీకి క్రెయిగ్ బ్రాత్‌వైట్ రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు సోమవారం ధ్రువీకరించింది. మార్చి 2021లో జాసన్ హోల్డర్ స్థానంలో వెస్టిండీస్ టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన బ్రాత్‌వైట్.. నాలుగేళ్ల పాటు నాయకుడిగా తన సేవలను అందించాడు.
"ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు కొత్త కెప్టెన్‌కు అవకాశమిచ్చేందుకు బ్రాత్‌వైత్ తన రాజీనామాను సమర్పించాడు. వెస్టిండీస్ క్రికెట్‌కు ఎన్నో అద్బుతమైన టెస్టు విజయాలను అందించింనందుకు అతడికి కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాము. కెప్టెన్‌గా అతని సేవలు ఎప్పటికీ మరవలేనివి. వెస్టిండీస్ క్రికెట్ పట్ల అతని అంకితభావాన్ని మాటల్లో వర్ణించలేము" అని విండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.
బ్రాత్‌వైట్ విండీస్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. అతడి సారథ్యంలోనే ఆస్ట్రేలియాలో 27 ఏళ్ల తర్వాత విండీస్ తొలి టెస్టు విజయాన్ని అందుకుంది. అదేవిధంగా బ్రాత్‌వైట్ కెప్టెన్సీలోనే 34 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్‌ను విండీస్ సమం చేసింది. మరోవైపు టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి రోవ్‌మన్ పావెల్‌ను వెస్టిండీస్ క్రికెట్ తప్పించింది. అతడి స్ధానంలో వన్డే కెప్టెన్‌గా ఉన్న షాయ్ హోప్‌కు టీ20 పగ్గాలను కూడా విండీస్ క్రికెట్ అప్పగించింది.