
'కోహ్లీ సారథ్యంలో ఉన్నత శిఖరాలకు.. '
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత క్రికెట్కు ఉజ్వల భవిష్యత్ ఉందని వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ అన్నాడు. కోహ్లీ బ్యాటింగ్ శైలి అద్భుతంగా ఉంటుందని ప్రశంసించాడు.
టీమిండియా వన్డే, టీ-20 జట్ల కెప్టెన్ ధోనీతో పోలిస్తే టెస్టు కెప్టెన్ కోహ్లీ భిన్నంగా ఉంటాడని రిచర్డ్స్ అభిప్రాయపడ్డాడు. మైదానంలో ధోనీ ప్రశాంతంగా కనిపిస్తే, కోహ్లీ దూకుడుగా ఉంటాడని చెప్పాడు. కాగా విరాట్ స్వభావాన్ని తప్పు పట్టాల్సిన పనిలేదని అన్నాడు. అతని దృక్పథంలో ఎలాంటి తప్పు కనిపించలేదని చెప్పాడు. కోహ్లీ ఇటీవల విఫలంకావడంపై రిచర్డ్స్ మాట్లాడుతూ.. అతని వయసు ఇంకా 26 ఏళ్లేనని, అంతర్జాతీయ క్రికెట్లో ఒడిదుడుకులు సహజమని, తన ఆటను మెరుగుపరచుకుంటాడని అన్నాడు. బీసీసీఐ కోరితే భారత బ్యాట్స్మెన్కు తన సేవలు అందిస్తానని రిచర్డ్స్ చెప్పాడు.