న్యూఢిల్లీ: భారత డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన 360 డిగ్రీ మెరుపుల రహస్యం చెప్పాడు. స్కూల్ రోజుల్లో సిమెంట్ ట్రాక్‌పై ఆడే సమయంలోనే తన ‘360’ ఆట మొదలైందన్నాడు. రబ్బర్ బంతులతో క్రికెట్ ఆడే సమయంలో లెగ్‌సైడ్ బౌండరీ 95 గజాల దూరంలో ఉంటే, ఆఫ్‌సైడ్ 25–30 గజాల దూరంలో ఉండేదని...వేగంగా లెగ్‌సైడ్ వైపు దూసుకొచ్చే బంతులను కాకుండా తక్కువ దూరంలో ఉన్న వైపు బౌండరీలు కొట్టేందుకు చేసిన ప్రయత్నమే 360 డిగ్రీ బ్యాటింగ్‌కు కారణమైందన్నాడు. అయితే నెట్స్‌లో మాత్రం అలా ప్రత్యేకించి 360 కోణంలో ఏనాడు ప్రాక్టీస్ చేయలేదని సూర్యకుమార్ చెప్పాడు.
స్టార్ బ్యాటర్స్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తన అదృష్టమన్నాడు. కోహ్లితో ఇటీవల మంచి భాగస్వామ్యాలు నమోదు చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు. రోహిత్‌తో అయితే తనకు పెద్దన్న అనుబంధమన్నాడు. ముంబై ఇండియన్స్‌లో 2018లో చేరినప్పటి నుంచి ఈ బంధం కొనసాగుతోందన్నాడు.
‘నా క్రికెట్ ప్రయాణంలో ముంబై ఇండియన్స్, నా భార్య దివిష కీలక పాత్ర పోషించారు. కేకేఆర్ నుంచి ముంబై ఫ్రాంచైజీకి మారిన తర్వాతే దశ కూడా మారింది. టాపార్డర్‌లో బ్యాటింగ్‌కు దింపడంతో నన్ను నేను నిరూపించుకున్నాను. దీనికి సరిగ్గా రెండేళ్ల ముందు 2016లో దివిషతో వివాహమైంది.
మేం ఒకటైనట్లే మా ఆలోచనలు ఒకటయ్యాయి. ఆమె వచ్చాక... నేను ముంబైలో చేరాక నా కెరీర్ మరో దశకు చేరింది’ అని వివరించాడు. దశాబ్దం క్రితమే భారత ఎమర్జింగ్ టీమ్ (అండర్–23) కెప్టెన్‌గా ఉన్న తనకు టీమిండియాలో ఎంపికయ్యేందుకు చాలా సమయమే పట్టిందన్నాడు. అయితే ఏనాడు కూడా నిరాశ చెందకుండా జాతీయ జట్టుకు ఎలా చేరాలన్న లక్ష్యంతోనే తన ఆటకు మెరుగులు దిద్దుకున్నానని సూర్యకుమార్ వివరించాడు.
ఒత్తిడిని ఎదుర్కోవడంపై మాట్లాడుతూ పదేళ్లు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడిన తనకు ఆటలో ఎదురయ్యే పరిస్థితులు తెలుసని, ఎలా అధిగమించాలో కూడా తెలుసని చెప్పాడు. అవకాశం లభిస్తే భారత టెస్టు జట్టులో కూడా సత్తా చాటగలనని సూర్యకుమార్ స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment