
ఇద్దరు దిగ్గజాల కలబోతే విరాట్ కోహ్లీ!
న్యూఢిల్లీ: వరుస సిరీస్ విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ప్రశంసించాడు. అసలు కోహ్లీ అంటే ఒక్క క్రికెటర్ కాదని.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ మాజీ దిగ్గజం సర్ వివ్ రిచర్డ్స్ ల కలబోతే కోహ్లీ అంటూ కొనియాడాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ భీకర ఇన్నింగ్స్ లు ఆడినా అతడి కంటే టెక్నికల్ గా కోహ్లీనే బెటర్ అని చెప్పాడు. భవిష్యత్తులో అందరూ ఆసీస్ క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్ మన్ కంటే ముందుగా కోహ్లీని కొలమానంగా చూస్తారని అభిప్రాయపడ్డాడు.
'కొన్నిసార్లు కోహ్లీ ఆట చూస్తే భయమేస్తుంది. తక్కువ సమయంలో ఎన్నో రికార్డులను అతడు అధిగమిస్తున్నాడు. అసాధారణ బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తూ.. క్రికెట్ ను మరో దశకు తీసుకెళ్తూ.. కొత్త సమీకరణాలను తెరపైకి తీసుకొస్తున్నాడు. ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ఫోర్ కొట్టినప్పుడు.. వారిని ఏమనకుండా.. నీ పని నువ్వు చేయ్ అంటూ ప్రోత్సహిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే కోహ్లీ ఫిట్ నెస్ అమోఘం. ఇందుకోసం అతడు ఎంతగానో శ్రమించాడని ఆటద్వారా నిరూపించుకున్నాడు' అని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ వివరించాడు.