భారత క్రికెట్‌లో పాతతరం నుంచి నేటివరకు తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. కపిల్ దేవ్, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, మహేంద్ర సింగ్ ధోని, జహీర్ ఖాన్, గౌతం గంభీర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా.. చెప్పుకొంటూ పోతే జాబితా పెరుగుతూనే ఉంటుంది.
పీయూశ్ చావ్లా ఏమన్నాడంటే
ఇంతమంది ఆటగాళ్లలో అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవాలంటే కష్టమే మరి! అయితే, భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ పీయూశ్ చావ్లా మాత్రం తనకు ఈ విషయంలో పూర్తి స్పష్టత ఉందంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 2006 నుంచి 2012 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు ఈ ఉత్తరప్రదేశ్ బౌలర్. కెరీర్‌లో మొత్తంగా 6 టెస్టుల్లో 7, 25 వన్డేల్లో 32, ఏడు టీ20లలో 4 వికెట్లు పడగొట్టాడు.
స్వల్ప కాలమే టీమిండియాకు ఆడినా పీయూశ్ చావ్లా ఖాతాలో రెండు ప్రపంచకప్ ట్రోఫీలు ఉండటం విశేషం. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో పీయూశ్ సభ్యుడు. గత పన్నెండేళ్లుగా ఐపీఎల్‌కే పరిమితమైన ఈ వెటరన్ స్పిన్నర్.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ ఆడుతున్నాడు.
కెప్టెన్‌గా ధోని.. నాలుగోస్థానంలో కోహ్లి
ఈ క్రమంలో శుభాంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీయూశ్ తన ఆల్‌టైమ్ ఇండియా వన్డే ప్లేయింగ్ ఎలెవన్‌ను వెల్లడించాడు. తన జట్టుకు ధోనిని కెప్టెన్‌గా ఎంచుకున్న పీయూశ్.. సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మలకు ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌కు మూడు, విరాట్ కోహ్లికి నాలుగో స్థానం ఇచ్చాడు.
మిడిలార్డర్‌లో ఆల్‌రౌండర్లు యువరాజ్ సింగ్, కపిల్ దేవ్‌లను ఎంపిక చేసుకున్న పీయూశ్.. ఆ తర్వాత ధోనిని నిలిపాడు. స్పిన్ విభాగంలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్‌లకు చోటిచ్చిన అతడు.. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్‌లను ఎంపిక చేసుకున్నాడు.
దాదా, గంభీర్‌కు చోటు లేదు
అయితే, వరల్డ్‌కప్(2007, 2011) హీరో గౌతం గంభీర్, స్టార్ కెప్టెన్ సౌరవ్ గంగూలీలకు పీయూశ్ తన జట్టులో చోటు ఇవ్వకపోవడం గమనార్హం. అంతేకాదు.. నంబర్ 3లో హిట్టయిన కోహ్లిని నాలుగో స్థానానికి ఎంచుకోవడం విశేషం. ఇదిలా ఉంటే.. 35 ఏళ్ల పీయూశ్ చావ్లా ఐపీఎల్ రికార్డు మాత్రం ఘనంగా ఉంది. ఇప్పటి వరకు 192 మ్యాచ్‌లు ఆడి 192 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహించాడు.
పీయూశ్ చావ్లా ఆల్‌టైమ్ వన్డే ప్లేయింగ్ ఎలెవన్
సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్.
చదవండి: పాకిస్తాన్‌లోనే చాంపియన్స్ ట్రోఫీ: ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్
Comments
Please login to add a commentAdd a comment