నవ్వుని చెరగనివ్వలేదు
అనంతరం
ప్రముఖ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, ప్రముఖ నటి నీనాగుప్తాల కూతురు.. మసాబా. తల్లి రంగు, తండ్రి పోలికలతో పుట్టింది. తండ్రిలోని ఆవేశం, తల్లిలోని ఆలోచన కూడా కలగలుపుకుని పెరిగింది. అందుకే ఆమెని చూస్తే... రిచర్డ్స్, నీనా... ఇద్దరూ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటారు. అయితే ఆ ఇద్దరి కారణంగానే సమాజం ఆమెను వేలెత్తి చూపించింది. కానీ మసాబా చలించలేదు. చలించివుంటే... ఆమె ఈరోజు టాప్ ఫ్యాషన్ డిజైనర్ అయ్యేది కాదు!
ఊహ తెలిసేనాటికి మసాబా ముందు ఓ పెద్ద ప్రశ్న నిలబడింది. ‘ఈ సమాజానికి ఏం సమాధానం చెప్పాలి’... ఇదే ఆ ప్రశ్న. అతి చిన్న వయసులో ఓ ఆడపిల్లకి అలాంటి ప్రశ్న ఎదురవడం చిన్న విషయమేమీ కాదు. కానీ మసాబాకు తప్పలేదు. తల్లి ఉంది. తండ్రి కూడా ఉన్నాడు. కానీ వాళ్లిద్దరూ కలిసి లేరు. కారణం... తనకు తండ్రి అయిన వ్యక్తి, తన తల్లికి తాళి కట్టలేదు. అంటే... సమాజం వింతగా చూసే పరిస్థితుల్లో ఉంది తాను. కానీ మసాబా ఎప్పుడూ ఆ విషయం గురించి ఆలోచించలేదు. ఇంకా చెప్పాలంటే... ఆమె తల్లి ఆమెనలా ఆలోచించనివ్వలేదు. అందుకే తాను సమాజం వైపు ఎప్పుడూ తలెత్తుకునే చూశానంటుందామె.
పెళ్లి కాకుండానే తల్లి అయిన మహిళని సమాజం ఎలా చూస్తుందో నీనాకి బాగా తెలుసు. కానీ ఆమె సమాజాన్ని ఎదిరించాలని నిర్ణయించుకున్నారు. మసాబాకు జన్మనిచ్చారు. తన బిడ్డని ప్రపంచానికి గర్వంగా చూపించారు. ఏనాడూ తండ్రిమీద విద్వేషాన్ని కూతురిలో రగల్చలేదామె. అందుకే తల్లితో పాటు తండ్రి దగ్గర కూడా సమానంగా పెరిగింది మసాబా. ఇద్దరి ప్రేమనూ అందిపుచ్చుకుంది. ఇద్దరి అనురాగాన్నీ ఆస్వాదించింది. కానీ వాళ్ల బంధం గురించి మాత్రం ఎప్పుడూ ఆలోచించలేదంటుంది. ‘‘అమ్మానాన్నల మధ్య ఏం జరిగిందో నాకు తెలుసు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కూడా నాకు తెలుసు. అందుకే ఏనాడూ నేను ఆ విషయం గురించి వాళ్ల దగ్గర ఎత్తలేదు, వాళ్లను ప్రశ్నించలేదు’ అంటుంది మసాబా.
అలాగని ఆమె అందరి పిల్లల్లాగే ఆనందంగా పెరిగిందా అంటే అదీ లేదు. అమ్మానాన్నలు కళ్లలో పెట్టుకున్నా... లోకులు ఆమెను పక్కన పెట్టాలనే చూసేవారు. తండ్రిలాగే అచ్చమైన వెస్టిండీస్ వ్యక్తిలా కనిపించే ఆమెను చూసి ఇండియాలో కొందరు హేళన చేసేవారు. తండ్రి బాటలో నడిచి క్రీడాకారిణి కావాలని అనుకుంటే... రిచర్డ్స్ కూతురా, అయితే అతడి ఆవేశమూ ఉండి ఉంటుంది, క్రీజు మీద చిందులేస్తుందో ఏమో’ అంటూ వెస్టిండీస్‌లో కొందరు కామెంట్ చేసేవారు. ఓ క్షణం మనసు చివుక్కుమన్నా... మరుక్షణం దాన్ని మర్చిపోయేది మసాబా. నవ్వు ముందు బాధ నిలబడలేదు అన్నది ఆమె సిద్ధాంతం. నేటి వరకూ దానినే అనుసరిస్తూ వచ్చింది. తనను చూసి ఎవరైనా ఎగతాళిగా నవ్వితే, దాన్ని స్వీకరిస్తూ నవ్వేది. తనను చూసి ఎవరైనా ప్రేమగా నవ్వితే, తిరిగి అభిమానంగా నవ్వేది. అన్నిటికీ నవ్వునే సమాధానంగా సంధించడం అలవాటు చేసుకున్నాక జీవితమంతా ఆనందమయమైపోయింది అంటుంది... నవ్వుతూనే.
గోల్ఫ్ ప్లేయర్ కావాలనుకుంది మసాబా. కానీ తన దుందుడుకు స్వభావానికి ఆటలు సరిపడవని అర్థం చేసుకుంది. అందుకే ఫ్యాషన్ ప్రపంచం వైపు దృష్టి పెట్టింది. రెండే రెండేళ్లలో భారతదేశంలోని టాప్ ఫ్యాషన్ డిజైనర్‌లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. విదేశాలకు తన డిజైన్లను విస్తరించింది. స్టయిల్‌కి మారుపేరులా ఉండే తన తల్లిని చూసే ఫ్యాషన్ అంటే ఏంటో తెలుసుకున్నాననే మసాబా... తన డిజైనర్ స్టూడియోను తల్లికే అప్పగించింది. తను మాత్రం... తన ప్రతిభను మరిన్ని మెట్లు ఎక్కించే ప్రయత్నంలో నిరంతర యజ్ఞం చేస్తోంది!
- సమీర నేలపూడి