ఐసీసీపై రిచర్డ్స్ రుసరుసలు
కింగ్స్టన్(జమైకా): వరల్డ్ టీ 20 కప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ ఆటగాళ్ల ప్రవర్తన సరిగా లేదంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) పేర్కొనడంపై ఆ దేశ దిగ్గజ ఆటగాడు వివ్ రిచర్డ్స్ మండిపడ్డాడు. విండీస్ కు ఒక నిబంధన, భారత్ కు మరొక నిబంధనగా ఐసీసీ తీరు ఉందని రిచర్డ్స్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. విండీస్ కప్ గెలిచిన అనంతరం ఆ దేశ కెప్టెన్ డారెన్ స్యామీ చేసిన వ్యాఖ్యాల్లో తప్పేముందని ప్రశ్నించాడు. తమ క్రికెట్ బోర్డు సరిగా లేకపోవడంతోనే స్యామీ ఆ రకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడన్నాడు
'విండీస్ ఆటగాళ్ల తీరును తప్పుబట్టడంతోనే ఐసీసీపై నేను ఎదురుదాడి చేయాల్సి వస్తుంది. ముందు పక్కదోవ పట్టిన మా క్రికెట్ బోర్డును సరి చేసి మాట్లాడండి. మా బోర్డుపై ఆటగాళ్ల ఆగ్రహం వెనుక చాలా కారాణాలున్నాయి. ఒకవేళ దాన్ని సక్రమైన మార్గంలో పెడితే.. అప్పుడు మీరు మాట్లాడే అధికారం ఉంది. అంతర్జాతీయంగా అన్ని క్రికెట్ జట్లను సమస్థాయిలో చూడాల్సిన బాధ్యత ఐసీసీది. దాన్ని ఐసీసీ అమలు చేయడంలేదు. కొంతమందికి ఒక రూల్, మరికొందరికి మరొక రూల్ అన్న చందంగా ఉంది సాగుతుంది ఐసీసీ తీరు'అని రిచర్డ్స్ విమర్శించాడు.
వరల్డ్ టీ 20 కప్ను గెలిచిన అనంతరం వెస్టిండీస్ క్రికెట్ జట్టులోని పలువురు ఆటగాళ్లు ఆ దేశ క్రికెట్ బోర్డును విమర్శించడాన్ని ఐసీసీ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. కొంతమంది ఆటగాళ్లు మీడియా ముందు శృతిమించి మాట్లాడాన్ని తప్పుబట్టిన ఐసీసీ.. అది బాధ్యతరాహిత్యమైన చర్యగా అభివర్ణించింది. ఒక మెగా టోర్నమెంట్లో ఆటగాళ్లు అలా అమర్యాదగా ప్రవర్తించడం కచ్చితంగా ఐసీసీ కోడ్లోని నిబంధల్ని అతిక్రమించడమేనని పేర్కొంది. ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారో వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.