బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఎంపికైన టీమిండియా పేసర్ హర్షిత్ రాణా రంజీ ట్రోఫీలో సత్తా చాటాడు. దేశవాలీ టోర్నీలో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న హర్షిత్.. అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో హర్షిత్ తొలుత ఐదు వికెట్ల ప్రదర్శన (5/80) నమోదు చేసి, ఆతర్వాత మెరుపు హాఫ్ సెంచరీ (59; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ హర్షిత్ రెండు వికెట్లు పడగొట్టాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులకు ఆలౌటైంది. సుమిత్ (162) భారీ సెంచరీతో సత్తా చాటగా.. శివ్‌శంకర్ రాయ్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో హర్షిత్ రాణా ఐదు వికెట్లు పడగొట్టగా.. హిమాన్షు చౌహాన్ 2, సిద్దాంత్ శర్మ, మోనీ గ్రేవల్, సుమిత్ మాథుర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 454 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో సుమిత్ మాథుర్ సెంచరీతో (112) కదంతొక్కగా.. హిమ్మద్ సింగ్ (55), హర్షిత్ రాణా (59), సిద్దాంత్ శర్మ (89) అర్ద సెంచరీలతో రాణించారు. అస్సాం బౌలర్లలో రాహుల్ సింగ్ నాలుగు, పుర్కాయస్తా మూడు, ముక్తర్ హుసేన్ రెండు, మ్రిన్మోయ్ దత్తా ఓ వికెట్ పడగొట్టారు.
124 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం.. నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 93 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు అస్సాం ఇంకా 31 పరుగులు వెనుకపడి ఉంది. సుమిత్ (17), ముక్తర్ హుసేన్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఢిల్లీ బౌలర్లలో హర్షిత్ రాణా, మోనీ గ్రేవల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జాంటీ సిద్దూ, సిద్దాంత్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు.
చదవండి: శతక్కొట్టిన మయాంక్ అగర్వాల్.. రాణించిన మనీశ్ పాండే
Comments
Please login to add a commentAdd a comment