World Womens Chess Championship
-
ఆరో స్థానంలో హంపి
వార్సా (పోలాండ్): ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఆరో స్థానంలో నిలిచింది. నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి 7.5 పాయింట్లు సాధించింది. హంపి నాలుగు గేముల్లో గెలిచి, ఏడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. హంపితోపాటు మరో ఎనిమిది మంది కూడా 7.5 పాయింట్లు స్కోరు చేశారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హంపికి ఆరో స్థానం దక్కింది. రష్యా గ్రాండ్‌మాస్టర్ కొస్టెనియుక్ 9 పాయింట్లతో తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. బిబిసారా (కజకిస్తాన్–8.5) రన్నరప్ నిలిచింది. గునీనా (రష్యా), కాటరీనా (రష్యా), సెరిక్బె (కజకిస్తాన్) మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. -
14లో హారిక...15లో హంపి
పెంగ్‌షుయె (చైనా): వరల్డ్ మాస్టర్స్ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి పేలవ ప్రదర్శన కనబరిచారు. 16 మంది మేటి క్రీడాకారిణుల మధ్య జరిగిన ఈ టోర్నీలో హారిక 14వ స్థానంలో, హంపి 15వ స్థానంలో నిలిచారు. నిర్ణీత 11 రౌండ్ల అనంతరం హంపి 4 పాయింట్లతో, హారిక 4.5 పాయింట్లతో చివరి నుంచి వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. రష్యాకు చెందిన అలెగ్జాండ్రా కోస్టెనిక్ 8 పాయింట్లతో విజేతగా అవతరించగా... వాలెంటీనా గునినా (రష్యా) 7 పాయింట్లతో రెండోస్థానంలో, మరియా ముజిచుక్ (ఉక్రెయిన్) 6.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. గురువారం జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌లో ఇరినా క్రుష్ (అమెరికా) చేతిలో ఓడిన హారిక... హంపితో పదోగేమ్‌ను 43 ఎత్తుల్లో, జి జావో (చైనా)తో పదకొండో గేమ్‌ను 65 ఎత్తుల్లో డ్రా చేసుకుంది. మరోవైపు హంపి చివరి రోజు మూడు డ్రాలను నమోదు చేసింది. అనా ఉషెనినా (ఉక్రెయిన్)తో తొమ్మిదో రౌండ్‌ను 48 ఎత్తుల్లో, హారికతో పదోరౌండ్ను 43 ఎత్తుల్లో, టింగ్జీ లీ (చైనా)తో పదకొండో రౌండ్‌ను 49 ఎత్తుల్లో డ్రాగా ముగించింది. -
హంపి, హారికలకు నిరాశ
పెంగ్‌షుయె (చైనా): వరల్డ్ మాస్టర్స్ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికల నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి హారిక 3.5 పాయింట్లతో 12వ స్థానంలో, హంపి 2.5 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచారు. ఐదో రౌండ్లో స్టెఫానోవా (బల్గేరియా)తో 64 ఎత్తుల్లో ఓడిన హంపి... ఎలిజబెత్ (జర్మనీ)తో జరిగిన ఆరో గేమ్‌ను 33 ఎత్తుల్లో డ్రా చేసుకుంది. ఏడో రౌండ్ గేమ్‌లో అనస్తాసియా (రష్యా) చేతిలో 23 ఎత్తుల్లో, ఎనిమిదో గేమ్‌లో ఇరినా క్రుష్ (అమెరికా) చేతిలో 40 ఎత్తుల్లో పరాజయం పాలైంది. మరోవైపు ఉషెనినా (ఉక్రెయిన్)తో జరిగిన ఐదో గేమ్‌ను 90 ఎత్తుల్లో, టింగ్జి (చైనా)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను 67 ఎత్తుల్లో, జనిడ్జె (జార్జియా)తో ఏడో గేమ్‌ను 23 ఎత్తుల్లో డ్రా చేసుకున్న హారిక... జోంగ్యి (చైనా)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో 76 ఎత్తుల్లో ఓటమి పాలైంది. -
రెండో రౌండ్లో హంపి
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. హయత్ తుబాల్ (అల్జీరియా)తో ఆదివారం జరిగిన రెండో గేమ్‌లో నల్ల పావులతో ఆడిన హంపి 46 ఎత్తుల్లో విజయం సాధించింది. దాంతో హంపి 2–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన తొలి గేమ్‌లోనూ హంపి గెలిచిన సంగతి తెలిసిందే. సోపికో ఖుఖాష్‌విలి (జార్జియా)తో జరిగిన రెండో గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 60 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. దాంతో వీరిద్దరి స్కోరు 1–1తో సమమైంది. సోమవారం జరిగే టైబ్రేక్‌లో వీరిద్దరి మధ్య విజేతను నిర్ణయిస్తారు. జన్సాయా అబ్దుమలిక్ (కజకిస్తాన్)తో జరిగిన రెండో గేమ్నూ భారత్‌కే చెందిన పద్మిని రౌత్ 76 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. స్కోరు 1–1తో సమం కావడంతో సోమవారం వీరిద్దరి మధ్య టైబ్రేక్‌ను నిర్వహిస్తారు. నటాలియా పొగోనినా (రష్యా)తో జరిగిన తొలి గేమ్‌లో ఓడిపోయిన భారత క్రీడాకారిణి భక్తి కులకర్ణి... ఆదివారం జరిగిన రెండో గేమ్‌ను 53 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని ఓవరాల్‌గా 0.5–1.5తో ఓడిపోయింది. -
162 ఎత్తుల్లో గెలిచిన హారిక... ఫైనల్ ఆశలు సజీవం
టెహరాన్ (ఇరాన్ ): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్ షిప్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఫైనల్‌కు చేరుకునే అవకాశాలు సజీవంగా ఉన్నాయి. తాన్ జోంగి (చైనా)తో శుక్రవారం జరిగిన సెమీఫైనల్ రెండో గేమ్‌లో హారిక 162 ఎత్తుల్లో గెలిచింది. దాంతో నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమమయ్యారు. తొలి గేమ్‌లో హారిక ఓడిపోవడంతో రెండో గేమ్‌లో ఆమె కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజేతను నిర్ణయించడానికి శనివారం వీరిద్దరి మధ్య టైబ్రేక్ గేమ్‌లు జరుగుతాయి. -
రెండో గేమ్‌లో హారిక ఓటమి
టెహరాన్: ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి పరాజయాన్ని చవిచూసింది. క్వార్టర్ ఫైనల్ చేరుకునే క్రమంలో ఒక్క గేమ్ కూడా తన ప్రత్యర్థులకు కోల్పోని హారిక జోరుకు జార్జియా క్రీడాకారిణి నానా జాగ్‌నిద్జె చెక్ పెట్టింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ రెండో గేమ్‌లో హారిక నల్లపావులతో ఆడుతూ 67 ఎత్తుల్లో నానా జాగ్‌నిద్జె చేతిలో ఓటమి పాలైంది. నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత చెరో విజయంతో హారిక, నానా జాగ్‌నిద్జె 1–1తో సమంగా ఉన్నారు. దాంతో వీరిద్దరి మధ్య విజేతను నిర్ణయించేందుకు బుధవారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహిస్తారు. టైబ్రేక్‌లో గెలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. -
హారిక విజయం
టెహరాన్: ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక శుభారంభం చేసింది. నానా జాగ్‌నిద్జె (జార్జియా)తో సోమవారం జరిగిన తొలి గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 47 ఎత్తు ల్లో విజయం సాధించింది. రెండు గేమ్‌ల మ్యాచ్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. నానా జాగ్నిద్జెతోనే మంగళవారం జరిగే రెండో గేమ్‌ను హారిక ‘డ్రా’ చేసుకుంటే సెమీఫైనల్లోకి ప్రవేశిస్తుంది. -
క్వార్టర్ ఫైనల్లో హారిక
టెహరాన్ (ఇరాన్): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... ఒడిషా అమ్మాయి పద్మిని రౌత్‌కు ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన టైబ్రేక్‌లో హారిక 2.5–1.5తో సొపికో గురామిష్‌విలి (జార్జియా)పై నెగ్గగా... పద్మిని 1.5–2.5తో తాన్ జోంగి (చైనా) చేతిలో ఓడిపోయింది. సోమవారం జరిగే క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో నానా జాగ్‌నిద్జె (జార్జియా)తో హారిక తలపడుతుంది. సొపికో, హారికల మధ్య జరిగిన తొలి రెండు టైబ్రేక్ గేమ్‌లు వరుసగా 53 ఎత్తుల్లో, 51 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. దాంతో స్కోరు 1–1తో సమమైంది. ఫలితం తేలడానికి వీరిద్దరి మధ్యే మరో రెండు గేమ్‌లు నిర్వహించగా... తొలి గేమ్‌లో హారిక 46 ఎత్తుల్లో గెలుపొంది... రెండో గేమ్‌ను 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన రెండు రెగ్యులర్ గేమ్‌ల తర్వాత ఇద్దరి స్కోర్లు 1–1తో సమం కావడంతో విజేతను నిర్ణయించడానికి ఆదివారం టైబ్రేక్‌లు నిర్వహించారు. -
టైబ్రేక్‌లపై హారిక, పద్మిని ఆశలు
టెహరాన్ (ఇరాన్ ): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్ షిప్లో భారత క్రీడాకారిణులు ద్రోణవల్లి హరిక, పద్మిని రౌత్ ముందంజ వేసే అవకాశాలు మళ్లీ టైబ్రేక్ గేమ్‌లపై ఆధారపడింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో గేమ్‌లలో వీరిద్దరూ తమ ప్రత్యరు్థలతో ‘డ్రా’ చేసుకున్నారు. సోపికో గురామిష్‌విలి (జార్జియా)తో జరిగిన గేమ్‌ను హారిక 36 ఎతు్తల్లో... తాన్ జోంగి (చైనా)తో జరిగిన గేమ్‌ను పద్మిని 23 ఎతు్తల్లో ‘డ్రా’గా ముగించారు. ఫలితంగా వీరిద్దరి మధ్య నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత స్కోరు 1–1తో సమవైుంది. ఆదివారం జరిగే టైబ్రేక్ గేముల్లో గెలిచిన వారు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో హారిక, పద్మిని
ప్రపంచ మహిళల చెస్ చాంపియన్ షిప్ టెహరాన్ : ప్రపంచ మహిళల చెస్ చాంపియన్ షిప్లో భారత క్రీడాకారిణులు ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్ మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. గురువారం జరిగిన రెండో రౌండ్ టైబ్రేక్ పోరులో వీరిద్దరు తమ ప్రత్యరు్థలను 1.5–0.5 పాయింట్ల (ఓవరాల్‌గా 2.5–1.5) తేడాతో ఓడించారు. దినారా సదుకసోవా (కజకిస్తాన్ )తో జరిగిన తొలి టైబ్రేక్ గేమ్‌లో తెల్ల పావులతో ఆడి హారిక 57 ఎతు్తల్లో విజయం సాధించింది. వీరిద్దరి మధ్య జరిగిన రెండో గేమ్ 49 ఎతు్తల్లో డ్రాగా ముగియడంతో హారికను విజయం వరించింది. జావో జుయ్ (చైనా)తో జరిగిన టైబ్రేక్‌లో కూడా పద్మిని తొలి గేమ్‌ను 65 ఎతు్తల్లో గెలుచుకుంది. నల్ల పావులతో ఆడినా పద్మిని దూకుడు ప్రదర్శించింది. రెండో గేమ్ 76 ఎతు్తల్లో డ్రాగా ముగిసింది. ఫలితంగా ఆమె కూడా ముందంజ వేసింది. -
హారిక, పద్మిని గేమ్‌లు ‘డ్రా’
టెహరాన్: ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణులు ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్ తమ రెండో రౌండ్ రెండో గేమ్‌లను కూడా ‘డ్రా’ చేసుకున్నారు. దినారా సదుకసోవా (కజకిస్తాన్)తో జరిగిన గేమ్‌ను హారిక 22 ఎత్తుల్లో... జావో జుయ్ (చైనా)తో జరిగిన గేమ్‌ను పద్మిని కూడా 22 ఎత్తుల్లో నే ‘డ్రా’గా ముగించారు. నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత హరిక–దినారా... పద్మిని–జాయ్ జుయ్ స్కోర్లు 1–1తో సమమయ్యాయి. దాంతో గురువారం వీరి మధ్యనే టైబ్రేక్ గేమ్‌లు నిర్వహిస్తారు. గెలిచినవారు ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. -
రెండో రౌండ్లో హారిక
టెహరాన్: ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో రౌండ్లోకి ప్రవేశించింది. షమీమా (బంగ్లాదేశ్)తో సోమవారం జరిగిన టైబ్రేక్‌లో హారిక 1.5–0.5తో విజయం సాధించింది. టైబ్రేక్ తొలి గేమ్‌లో హారిక 49 ఎత్తుల్లో గెలిచి... రెండో గేమ్‌ను 75 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. మంగళవారం జరిగే రెండో రౌండ్ తొలి గేమ్‌లో దినారా సదుకసోవా (కజకిస్తాన్)తో హారిక తలపడుతుంది. -
హైదరాబాద్ (vs) విజయవాడ
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ కోసం రెండు రాష్ట్ర సంఘాల ప్రయత్నాలు హైదరాబాద్, విజయవాడ స్పోర్ట్స్: అన్నీ అనుకున్నట్లుగా జరిగితే తెలుగు నేలపై త్వరలో ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ జరిగే అవకాశం ఉంది. ఈసారి ఈ టోర్నీని ప్రపంచ సమాఖ్య భారత్‌కు కేటాయించింది. దాదాపు రూ.8 కోట్లు ఖర్చయ్యే ఈ టోర్నీని విజయవాడలో నిర్వహించాలని ఏపీ చెస్ సంఘం, హైదరాబాద్‌లో జరపాలని తెలంగాణ చెస్ సంఘం కూడా ప్రయత్నాలు ప్రారంభిం చాయి. ఈ రెండు సంఘాలు మినహా దేశంలో ప్రస్తుతానికి మరే చెస్ సంఘం ప్రయత్నాలు చేయడం లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఈ టోర్నీలో ప్రపంచంలోని 64 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణులు పాల్గొంటారు. 23 రోజులపాటు జరిగే ఈ చాంపియన్‌షిప్ ఎక్కడ జరుగుతుందో చూడాలి. -
పోరాడి ఓడిన హారిక
ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ సోచి (రష్యా): ఒత్తిడిలో తడబడిన భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రపంచ మహిళల నాకౌట్ చెస్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లో ఓటమి పాలైంది. అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా ఉన్న మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో జరిగిన సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి హారిక 2.5-3.5 పాయింట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. క్లాసికల్ పద్ధతిలో జరిగిన నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1-1తో సమఉజ్జీగా నిలువడంతో విజేతను నిర్ణయించడానికి మంగళవారం ర్యాపిడ్ పద్ధతిలో టైబ్రేక్ గేమ్‌లను నిర్వహించారు. తొలుత 25 నిమిషాల నిడివి కలిగిన రెండు గేమ్‌లు జరిగాయి. ఇందులో తొలి గేమ్‌లో హారిక 38 ఎత్తుల్లో ఓడిపోయింది. అయితే వెంటనే తేరుకొని రెండో గేమ్‌లో హారిక 80 ఎత్తుల్లో గెలుపొందడంతో స్కోరు 1-1తో సమమైంది. దాంతో ఈసారి 10 నిమిషాల నిడివి కలిగిన రెండు గేమ్‌లను నిర్వహించారు. ఇందులో తెల్లపావులతో తొలి గేమ్‌ను ఆడిన హారిక 96 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఒకానొక దశలో హారికకు ఈ గేమ్‌లో స్పష్టమైన విజయావకాశాలు కనిపించాయి. కానీ మరియా ముజిచుక్ చక్కటి వ్యూహాలతో ‘డ్రా’ చేసుకోగలిగింది. ఇక రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన మరియా 56 ఎత్తుల్లో హారికపై నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకుంది. 2012 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ హారిక సెమీఫైనల్ దశలోనే నిష్ర్కమించింది. గురువారం మొదలయ్యే నాలుగు గేమ్‌ల ఫైనల్లో నటాలియా పోగోనినా (రష్యా)తో మరియా ముజిచుక్ తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో పోగోనినా టైబ్రేక్‌లో 1.5-0.5తో పియా క్రామ్లింగ్ (స్వీడన్)పై గెలిచింది. మరియా, పోగోనినా మధ్య ఫైనల్లో గెలిచిన వారు ఈ ఏడాది చివర్లో హూ ఇఫాన్ (చైనా)తో ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో తలపడతారు. -
హారిక సెమీస్ గేమ్ ‘డ్రా’
నేడు టైబ్రేక్ సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ పోరుకు చేరేదెవరో మంగళవారం తేలనుంది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక, మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత టైబ్రేక్‌కు దారితీసింది. ఆదివారం వీరిద్దరి మధ్య జరిగిన తొలి గేమ్ ‘డ్రా’గా ముగియగా... సోమవారం జరిగిన రెండో గేమ్ కూడా ‘డ్రా’ అయింది. దాంతో ఇద్దరూ 1-1తో సమఉజ్జీగా నిలిచారు. రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 78 ఎత్తుల తర్వాత ‘డ్రా’కు అంగీకరించింది. పియా క్రామ్లింగ్ (స్వీడన్), నటాలియా పోగోనినా (రష్యా)ల మధ్య రెండో సెమీఫైనల్లో నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1-1తో సమంగా ఉన్నారు. తొలి గేమ్‌లో క్రామ్లింగ్ 79 ఎత్తుల్లో గెలుపొందగా... రెండో గేమ్‌లో పోగోనినా 38 ఎత్తుల్లో విజయం సాధించింది. దాంతో రెండు సెమీఫైనల్స్ విజేతలను నిర్ణయించడానికి మంగళవారం టైబ్రేక్ గేమ్‌లను నిర్వహిస్తారు. -
హారిక గేమ్ డ్రా
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ సెమీఫైనల్ రౌండ్ తొలి గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ‘డ్రా’ చేసుకుంది. అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా ఉన్న మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో ఆదివారం జరిగిన తొలి గేమ్‌ను నల్లపావులతో ఆడిన హారిక 60 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. సోమవారం వీరిద్దరి మధ్యే రెండో గేమ్ జరుగుతుంది. ఈ గేమ్‌లో హారిక తెల్లపావులతో ఆడనుండటం ఆమెకు అనుకూలాంశం. ఈ గేమ్‌లో నెగ్గినవారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఒకవేళ ఈ గేమ్ కూడా ‘డ్రా’ అయితే విజేతను నిర్ణయించడానికి మంగళవారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహిస్తారు. -
క్వార్టర్స్‌లో హంపి ఓటమి
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి పోరాటం ముగిసింది. క్వార్టర్ఫైనల్లో మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో జరిగిన రెండు గేమ్‌ల్లో 1-1తో సమ ఉజ్జీగా నిలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకున్న హంపి... శనివారం జరిగిన టైబ్రేక్‌లో మాత్రం 0.5-1.5తో పరాజయం పాలైంది. తొలి టైబ్రేక్‌ను నల్లపావులతో ఆడిన హంపి 58 ఎత్తుల్లో డ్రాగా ముగించింది. రెండో టైబ్రేక్‌లో మాత్రం మరియా ఎత్తులకు చిత్తయ్యింది. తెల్లపావులతో ఆడిన హంపి 42 ఎత్తుల్లో ఓటమిని అంగీకరించింది. సెమీఫైనల్ పోరులో ఏపీ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికతో మరియా తలపడుతుంది. -
సెమీస్‌లో హారిక హంపి ఆశలు సజీవం
సోచి (రష్యా): అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మేరీ అరాబిద్జె (జార్జియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో హారిక 1.5-0.5 తేడాతో విజయం సాధించింది. గురువారం జరిగిన తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న హారిక... శుక్రవారం జరిగిన రెండో గేమ్‌లో 95 ఎత్తుల్లో గెలిచింది. 2012 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ హారిక సెమీఫైనల్‌కు చేరుకున్నా ఆ అడ్డంకిని దాటలేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి సెమీఫైనల్ ఆశలు సజీవంగా నిలబెట్టుకుంది. మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో తప్పనిసరిగా నెగ్గాల్సిన రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన టాప్ సీడ్ హంపి 62 ఎత్తుల్లో గెలిచింది. దాంతో ఈ ఇద్దరు 1-1తో సమంగా ఉన్నారు. వీరిద్దరి మధ్య విజేతను నిర్ణయించేందుకు శనివారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహిస్తారు. ఈ పోటీలో నెగ్గిన వారు సెమీఫైనల్లో హారికతో తలపడతారు. -
హంపికి షాక్, హారిక గేమ్ డ్రా
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్స్ తొలి గేముల్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) హోదా ఉన్న మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో టాప్ సీడ్ హంపి 29 ఎత్తుల్లో అనూహ్య ఓటమి చవిచూసింది. ఈ టోర్నీలో హంపికిదే తొలి పరాజయం కావడం గమనార్హం. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే శుక్రవారం జరిగే రెండో గేమ్‌లో హంపి తప్పనిసరిగా గెలవాలి. మరోవైపు హారిక తన ప్రత్యర్థి మేరీ అరాబిద్జె (జార్జియా)తో జరిగిన తొలి గేమ్‌ను కేవలం 15 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. వీరిద్దరి మధ్య శుక్రవారం జరిగే రెండో గేమ్‌లో నెగ్గిన వారు సెమీఫైనల్‌కు అర్హత పొందుతారు. ఒకవేళ ఈ గేమ్ కూడా ‘డ్రా’గా ముగిస్తే శనివారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. -
క్వార్టర్స్‌లో హంపి
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అలీసా గలియమోవా (రష్యా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో హంపి 2-0తో గెలిచింది. మంగళవారం జరిగిన రెండో గేమ్ లో హంపి 53 ఎత్తుల్లో విజయం సాధించింది. ఈ టోర్నీలో హంపికిది వరుసగా ఆరో గెలుపు కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మాత్రం ప్రిక్వార్టర్స్ రెండో గేమ్‌లో అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) చేతిలో 51 ఎత్తుల్లో ఓడిపోయింది. ఫలితంగా వీరిద్దరూ 1-1తో సమఉ జ్జీగా నిలిచారు. దాంతో ఈ ఇద్దరి మధ్య బుధవారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు.