క్వార్టర్ ఫైనల్లో హారిక
టెహరాన్ (ఇరాన్): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... ఒడిషా అమ్మాయి పద్మిని రౌత్‌కు ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన టైబ్రేక్‌లో హారిక 2.5–1.5తో సొపికో గురామిష్‌విలి (జార్జియా)పై నెగ్గగా... పద్మిని 1.5–2.5తో తాన్ జోంగి (చైనా) చేతిలో ఓడిపోయింది. సోమవారం జరిగే క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో నానా జాగ్‌నిద్జె (జార్జియా)తో హారిక తలపడుతుంది.
సొపికో, హారికల మధ్య జరిగిన తొలి రెండు టైబ్రేక్ గేమ్‌లు వరుసగా 53 ఎత్తుల్లో, 51 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. దాంతో స్కోరు 1–1తో సమమైంది. ఫలితం తేలడానికి వీరిద్దరి మధ్యే మరో రెండు గేమ్‌లు నిర్వహించగా... తొలి గేమ్‌లో హారిక 46 ఎత్తుల్లో గెలుపొంది... రెండో గేమ్‌ను 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన రెండు రెగ్యులర్ గేమ్‌ల తర్వాత ఇద్దరి స్కోర్లు 1–1తో సమం కావడంతో విజేతను నిర్ణయించడానికి ఆదివారం టైబ్రేక్‌లు నిర్వహించారు.