హంపికి షాక్, హారిక గేమ్ డ్రా
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్స్ తొలి గేముల్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) హోదా ఉన్న మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో టాప్ సీడ్ హంపి 29 ఎత్తుల్లో అనూహ్య ఓటమి చవిచూసింది. ఈ టోర్నీలో హంపికిదే తొలి పరాజయం కావడం గమనార్హం.
సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే శుక్రవారం జరిగే రెండో గేమ్‌లో హంపి తప్పనిసరిగా గెలవాలి. మరోవైపు హారిక తన ప్రత్యర్థి మేరీ అరాబిద్జె (జార్జియా)తో జరిగిన తొలి గేమ్‌ను కేవలం 15 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. వీరిద్దరి మధ్య శుక్రవారం జరిగే రెండో గేమ్‌లో నెగ్గిన వారు సెమీఫైనల్‌కు అర్హత పొందుతారు. ఒకవేళ ఈ గేమ్ కూడా ‘డ్రా’గా ముగిస్తే శనివారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు.