తానియా, హంపి, హారిక, వైశాలి (ఫైల్)
అల్మాటీ (కజకిస్తాన్): ఈ ఏడాదిని చిరస్మరణీయంగా ముగించాలనే లక్ష్యంతో నేటి నుంచి ఐదు రోజులపాటు జరిగే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. మహిళల విభాగంలో 2019 ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్, 2012 కాంస్య పతక విజేత, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపితోపాటు ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్‌దేవ్, సవితా శ్రీ, పద్మిని రౌత్, దివ్యా దేశ్‌ముఖ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
మొదటి మూడు రోజులు ర్యాపిడ్ విభాగంలో, ఆ తర్వాత రెండు రోజులు బ్లిట్జ్ విభాగంలో పోటీలు జరుగుతాయి. ర్యాపిడ్ టోర్నీని 11 రౌండ్‌లపాటు, బ్లిట్జ్ టోర్నీని 17 రౌండ్‌లపాటు నిర్వహిస్తారు. ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, హర్ష భరతకోటిలతోపాటు విదిత్ సంతోష్ గుజరాతి, సూర్యశేఖర గంగూలీ, నిహాల్ సరీన్, ఎస్‌ఎల్ నారాయణన్, అరవింద్ చిదంబరం, అభిమన్యు పురాణిక్, ఆధిబన్, రౌనక్ సాధ్వాని, శ్రీనాథ్ నారాయణన్, వి.ప్రణవ్, అర్జున్ కల్యాణ్, సంకల్ప్ గుప్తా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఓపెన్ ర్యాపిడ్ టోర్నీని 13 రౌండ్‌లు, బ్లిట్జ్ టోర్నీని 21 రౌండ్‌లు నిర్వహిస్తారు. మహిళల ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలలో టాప్–3లో నిలిచిన వారికి వరుసగా 40 వేల డాలర్లు (రూ. 33 లక్షల 11 వేలు), 30 వేల డాలర్లు (రూ. 28 లక్షల 83 వేలు), 20 వేల డాలర్లు (రూ. 16 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీగా ఇస్తారు. ఓపెన్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలలో టాప్–3లో నిలిచిన వారికి వరుసగా 60 వేల డాలర్లు (రూ. 49 లక్షల 67 వేలు), 50 వేల డాలర్లు (రూ. 41 లక్షల 39 వేలు), 40 వేల డాలర్లు (రూ. 33 లక్షల 11 వేలు) ప్రైజ్‌మనీగా అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment