World Chess Championship 2022: Koneru Humpy Qualifies Womens World Chess Championship 2022 - Sakshi
Sakshi News home page

ప్రపంచ క్యాండిడేట్స్‌ మహిళల చెస్‌ టోర్నీకి కోనేరు హంపి అర్హత

Published Thu, Jun 3 2021 4:45 AM | Last Updated on Thu, Jun 3 2021 10:16 AM

Koneru Humpy qualifies for womens Candidates  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహిళల ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌–2022 మ్యాచ్‌కు అర్హత టోర్నీ అయిన ప్రపంచ క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌కు భారత స్టార్‌ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి అర్హత సాధించింది. 2019–2021 మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ హంపి 293 పాయింట్లతో ఓవరాల్‌గా రెండో స్థానంలో నిలువడంతో ఆమెకు క్యాండిడేట్స్‌ టోర్నీ బెర్త్‌ ఖరారైంది. హంపితోపాటు కాటరీనా లాగ్నో (రష్యా–280 పాయింట్లు), గత ప్రపంచ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లో రన్నరప్‌గా నిలిచిన అలెక్సాండ్రా గోర్యాచ్‌కినా (రష్యా) కూడా క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత పొందారు.  

∙గ్రాండ్‌ప్రి సిరీస్‌లోని నాలుగు టోర్నీలలో చివరిదైన జిబ్రాల్టర్‌ టోర్నీ బుధవారం ముగిసింది. ఈ టోర్నీలో హంపి ఆడకపోయినా గతంలో ఆమె ఆడిన రెండు గ్రాండ్‌ప్రి టోర్నీలలో అద్భుత ప్రదర్శన చేసింది. రష్యాలోని స్కొల్కోవాలో జరిగిన టోర్నీలో హంపి విజేతగా (160 పాయింట్లు), మొనాకో టోర్నీలో సంయుక్త విజేతగా (133 పాయింట్లు) నిలిచింది. కరోనా నేపథ్యంలో హంపి జిబ్రాల్టర్‌ టోర్నీకి దూరంగా ఉంది. ఈ టోర్నీలో బరిలోకి దిగిన నానా జాగ్‌నిద్జె (జార్జియా), అనా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌), కాటరీనా లాగ్నో (రష్యా)లలో ఇద్దరు టాప్‌–3లో నిలిచి ఉంటే హంపికి క్యాండిడేట్స్‌ టోర్నీ బెర్త్‌ కోసం కొంతకాలం వేచి చూడాల్సి వచ్చేది. అయితే ఈ ముగ్గురిలో కాటరీనా మాత్రమే టాప్‌–3లో నిలువడంతో హంపికి బెర్త్‌ ఖరారైంది.  

∙వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో జరిగే క్యాండిడేట్స్‌ టోర్నీలో మొత్తం ఎనిమిది మంది పాల్గొంటారు. ఈ టోర్నీ విజేత 2022 ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జూ వెన్‌జున్‌ (చైనా)తో తలపడుతుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement