Womens World Chess Championship
-
ప్రపంచ క్యాండిడేట్స్ మహిళల చెస్ టోర్నీకి కోనేరు హంపి అర్హత
సాక్షి, హైదరాబాద్: మహిళల ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్–2022 మ్యాచ్‌కు అర్హత టోర్నీ అయిన ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌కు భారత స్టార్ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి అర్హత సాధించింది. 2019–2021 మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ హంపి 293 పాయింట్లతో ఓవరాల్‌గా రెండో స్థానంలో నిలువడంతో ఆమెకు క్యాండిడేట్స్ టోర్నీ బెర్త్ ఖరారైంది. హంపితోపాటు కాటరీనా లాగ్నో (రష్యా–280 పాయింట్లు), గత ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో రన్నరప్‌గా నిలిచిన అలెక్సాండ్రా గోర్యాచ్కినా (రష్యా) కూడా క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత పొందారు. ∙గ్రాండ్‌ప్రి సిరీస్‌లోని నాలుగు టోర్నీలలో చివరిదైన జిబ్రాల్టర్ టోర్నీ బుధవారం ముగిసింది. ఈ టోర్నీలో హంపి ఆడకపోయినా గతంలో ఆమె ఆడిన రెండు గ్రాండ్‌ప్రి టోర్నీలలో అద్భుత ప్రదర్శన చేసింది. రష్యాలోని స్కొల్కోవాలో జరిగిన టోర్నీలో హంపి విజేతగా (160 పాయింట్లు), మొనాకో టోర్నీలో సంయుక్త విజేతగా (133 పాయింట్లు) నిలిచింది. కరోనా నేపథ్యంలో హంపి జిబ్రాల్టర్ టోర్నీకి దూరంగా ఉంది. ఈ టోర్నీలో బరిలోకి దిగిన నానా జాగ్‌నిద్జె (జార్జియా), అనా ముజిచుక్ (ఉక్రెయిన్), కాటరీనా లాగ్నో (రష్యా)లలో ఇద్దరు టాప్–3లో నిలిచి ఉంటే హంపికి క్యాండిడేట్స్ టోర్నీ బెర్త్ కోసం కొంతకాలం వేచి చూడాల్సి వచ్చేది. అయితే ఈ ముగ్గురిలో కాటరీనా మాత్రమే టాప్–3లో నిలువడంతో హంపికి బెర్త్ ఖరారైంది. ∙వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో జరిగే క్యాండిడేట్స్ టోర్నీలో మొత్తం ఎనిమిది మంది పాల్గొంటారు. ఈ టోర్నీ విజేత 2022 ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జూ వెన్జున్ (చైనా)తో తలపడుతుంది. -
మళ్లీ టైబ్రేక్‌లో హారిక భవితవ్యం
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తన ఖాతాలో మరో ‘డ్రా’ నమోదు చేసింది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో శనివారం జరిగిన మూడో రౌండ్ రెండో గేమ్‌ను హారిక 29 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. దాంతో నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత ఇద్దరు 1–1తో సమమయ్యారు. ఫలితంగా వీరిద్దరిలో విజేతను నిర్ణయించేందుకు ఆదివారం టైబ్రేక్‌ను నిర్వహిస్తారు. తొలి రెండు రౌండ్లలో కూడా హారిక టైబ్రేక్ ఆధారంగానే విజయం సాధించింది. మరి మూడో రౌండ్లో ఆమెకు ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూడాలి. -
హారిక గేమ్ ‘డ్రా’
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మరో ‘డ్రా’ నమోదు చేసింది. తొలి రౌండ్లో, రెండో రౌండ్లో ఆడిన రెండేసి గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని... ‘టైబ్రేక్’లో విజయాలు సాధించి ముందంజ వేసిన హారిక మూడో రౌండ్‌లోని తొలి గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో శుక్రవారం జరిగిన తొలి గేమ్‌ను తెల్లపావులతో ఆడిన హారిక 58 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. శనివారం జరిగే రెండో గేమ్‌లో గెలిచిన వారు తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తారు. ‘డ్రా’ అయితే ఆదివారం టైబ్రేక్ నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. -
వచ్చే సారి స్వర్ణం సాధిస్తా!
టైబ్రేక్‌లో ఒత్తిడికి లోనయ్యా వరల్డ్ చాంపియన్‌షిప్‌పై హారిక సాక్షి, హైదరాబాద్: మహిళల చెస్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ సారి స్వర్ణం సాధించాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగానని, అయితే మరో సారి కాంస్యానికే పరిమితం కావడం నిరాశ కలిగించిందని భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక వ్యాఖ్యానించింది. ఇటీవల రష్యాలోని సోచిలో జరిగిన ఈ టోర్నీ సెమీఫైనల్లో మారియా ముజిచుక్ (ఉక్రెయిన్) చేతిలో హారిక ఓడింది. ‘2012లో కూడా నేను కాంస్యం సాధించాను. ఆ తర్వాత రెండేళ్లకు పైగా పగలూ రాత్రి శ్రమించాను. ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం నా షెడ్యూల్‌ను మార్చుకున్నాను. కానీ మరోసారి కాంస్యానికే పరిమితమయ్యాను. అయితే ఇవన్నీ పాఠాలుగా మలచుకుంటా. ఓవరాల్‌గా నేను టోర్నీలో చాలా బాగా ఆడాను. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో బయటపడగలిగాను. అందుకే సంతృప్తిగానే ఉంది. వచ్చే ప్రపంచ చాంపియన్షిప్లోనైనా స్వర్ణం సాధించాలనేదే నా లక్ష్యం’ అని హారిక చెప్పింది. కాంస్యం గెలుచుకున్న సందర్భంగా మంగళవారం హారిక స్పాన్సర్లు లక్ష్య-సహ్యద్రి ఇండస్ట్రీస్ ఆమెను ప్రత్యేకంగా సన్మానించాయి. ఈ టోర్నీలో 12వ సీడ్‌గా బరిలోకి దిగినా...తన ప్రదర్శన బాగుందని, అయితే టైబ్రేక్ ఒత్తిడిలో చేసిన చిన్న తప్పుతో తాను ఓడానని హారిక గుర్తు చేసుకుంది. వరుసగా రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్యాలు సాధించిన హారిక, తనకు హంపితో పోటీ లేదని స్పష్టం చేసింది. ఈ నెల 19నుంచి చైనాలో జరిగే ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో హంపి, హారిక ఉన్నారు. ‘నా కెరీర్లో చాలా విజయాలు సాధించాను. అయితే అంతకు ముందే హంపి అవన్నీ గెలుచుకుంది. ఈ సారి హంపికి ముందే ఏదైనా టైటిల్ గెలవాలని కోరుకుంటున్నా. ఆమెతో నాకు పోలిక వద్దు. ‘డ్రా’ ప్రకారం మేము ప్రపంచ చాంపియన్‌షిప్ సెమీస్‌లో తలపడితే అదో విశేషమయ్యేది. కానీ హంపి క్వార్టర్స్‌లో ఓడటంతో అది సాధ్యం కాలేదు. వరల్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో మేం సమష్టిగా రాణిస్తాం’ అని హారిక పేర్కొంది. ఈ సందర్భంగా తన స్పాన్సర్లతో పాటు ఆర్థిక సహకారం అందించిన భారత ప్రభుత్వానికి హారిక కృతజ్ఞతలు తెలిపింది.