వచ్చే సారి స్వర్ణం సాధిస్తా!
టైబ్రేక్‌లో ఒత్తిడికి లోనయ్యా వరల్డ్ చాంపియన్‌షిప్‌పై హారిక
సాక్షి, హైదరాబాద్: మహిళల చెస్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ సారి స్వర్ణం సాధించాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగానని, అయితే మరో సారి కాంస్యానికే పరిమితం కావడం నిరాశ కలిగించిందని భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక వ్యాఖ్యానించింది. ఇటీవల రష్యాలోని సోచిలో జరిగిన ఈ టోర్నీ సెమీఫైనల్లో మారియా ముజిచుక్ (ఉక్రెయిన్) చేతిలో హారిక ఓడింది. ‘2012లో కూడా నేను కాంస్యం సాధించాను. ఆ తర్వాత రెండేళ్లకు పైగా పగలూ రాత్రి శ్రమించాను. ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం నా షెడ్యూల్‌ను మార్చుకున్నాను. కానీ మరోసారి కాంస్యానికే పరిమితమయ్యాను.
అయితే ఇవన్నీ పాఠాలుగా మలచుకుంటా. ఓవరాల్‌గా నేను టోర్నీలో చాలా బాగా ఆడాను. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో బయటపడగలిగాను. అందుకే సంతృప్తిగానే ఉంది. వచ్చే ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనైనా స్వర్ణం సాధించాలనేదే నా లక్ష్యం’ అని హారిక చెప్పింది. కాంస్యం గెలుచుకున్న సందర్భంగా మంగళవారం హారిక స్పాన్సర్లు లక్ష్య-సహ్యద్రి ఇండస్ట్రీస్ ఆమెను ప్రత్యేకంగా సన్మానించాయి. ఈ టోర్నీలో 12వ సీడ్‌గా బరిలోకి దిగినా...తన ప్రదర్శన బాగుందని, అయితే టైబ్రేక్ ఒత్తిడిలో చేసిన చిన్న తప్పుతో తాను ఓడానని హారిక గుర్తు చేసుకుంది. వరుసగా రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్యాలు సాధించిన హారిక, తనకు హంపితో పోటీ లేదని స్పష్టం చేసింది.
ఈ నెల 19నుంచి చైనాలో జరిగే ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో హంపి, హారిక ఉన్నారు. ‘నా కెరీర్‌లో చాలా విజయాలు సాధించాను. అయితే అంతకు ముందే హంపి అవన్నీ గెలుచుకుంది. ఈ సారి హంపికి ముందే ఏదైనా టైటిల్ గెలవాలని కోరుకుంటున్నా. ఆమెతో నాకు పోలిక వద్దు. ‘డ్రా’ ప్రకారం మేము ప్రపంచ చాంపియన్‌షిప్ సెమీస్‌లో తలపడితే అదో విశేషమయ్యేది. కానీ హంపి క్వార్టర్స్‌లో ఓడటంతో అది సాధ్యం కాలేదు. వరల్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో మేం సమష్టిగా రాణిస్తాం’ అని హారిక పేర్కొంది. ఈ సందర్భంగా తన స్పాన్సర్లతో పాటు ఆర్థిక సహకారం అందించిన భారత ప్రభుత్వానికి హారిక కృతజ్ఞతలు తెలిపింది.