ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి... అందివచ్చిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకొని... గతంలో ఏ భారతీయ క్రీడాకారిణికి సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకొని... అంతర్జాతీయ వేదికపై మరోసారి అబ్బురపరిచే ప్రదర్శనతో భారత చెస్ పతాకాన్ని రెపరెపలాడించి... అందరిచేతా శభాష్ అనిపించుకుంది ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్‌మాస్టర్ (జీఎం), భారత మహిళల నంబర్‌వన్ ప్లేయర్ కోనేరు హంపి. మాస్కోలో జరుగుతున్న ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మహిళల ర్యాపిడ్ విభాగంలో హంపి విశ్వవిజేతగా అవతరించింది.
ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె కొత్త చరిత్ర సృష్టించింది. గతంలో నాలుగుసార్లు సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన హంపికి సీనియర్ విభాగంలో మాత్రం విశ్వకిరీటం ఊరిస్తూ వస్తోంది. అయితే తనకెంతో పట్టున్న క్లాసికల్ విభాగంలో కాకుండా ధనాధన్ పద్ధతిలో జరిగే ర్యాపిడ్ విభాగంలో హంపి విశ్వవిజేతగా నిలిచి తన స్వప్నాన్ని సాకారం చేసుకుంది.
సాక్షి, హైదరాబాద్ : ఒకదశలో టాప్–3లో నిలిస్తే చాలు అనుకునే స్థితిలో ఉన్నప్పటికీ...ఒకవైపు ఫేవరెట్స్‌గా భావించిన క్రీడాకారిణుల ఫలితాలు చివరి రెండు రౌండ్‌లలో తారుమారు కావడం... మరోవైపు తాను వరుసగా రెండు విజయాలు సాధించడంతో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) కోనేరు హంపికి ఒక్కసారిగా ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్íÙప్‌లో స్వర్ణ పతకం కోసం, ప్రపంచ టైటిల్ కోసం పోటీపడే అవకాశం వచి్చంది. ఊహించని ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్న హంపి... ఏమాత్రం సంయమనం కోల్పోకుండా, స్థిరచిత్తంతో ఆడి ప్రత్యర్థి ఆట కట్టించింది. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఊహించనిరీతిలో అద్భుత విజయం సొంతం కావడం ఎంతో మధురంగా అనిపిస్తోందని... ఈ గెలుపు తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందని మాస్కో నుంచి ‘సాక్షి’కి ఇచి్చన ఇంటర్వ్యూలో హంపి వ్యాఖ్యానించింది. పలు అంశాలపై హంపి వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే...
ఊహించలేదు...
ర్యాపిడ్ విభాగం చివరి రోజు గేమ్‌లు మొదలయ్యే సమయానికి నేను ఐదో స్థానంలో ఉన్నా. మిగిలిన నాలుగు గేముల్లో మంచి ప్రదర్శన చేసి టాప్–3లోకి రావాలనుకున్నా. కానీ నేను రెండు గేముల్లో నెగ్గడం... ఇతర క్రీడాకారిణులు ఓడిపోవడంతో నాతోపాటు మరో ఇద్దరు లీ టింగ్‌జి (చైనా), ఎకతెరీనా అతాలిక్ (టర్కీ) 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలోకి వచ్చారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా తొలి రెండు స్థానాల్లో నిలువడంతో నేను, లీ టింగ్‌జి ప్రపంచ టైటిల్ కోసం టైబ్రేక్ గేమ్‌లు ఆడాల్సి వచి్చంది. సీనియర్ విభాగంలో తొలి ప్రపంచ టైటిల్ గెలిచే అవకాశం వచ్చిందని భావించాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. టైబ్రేక్ తొలి గేమ్‌లో ఓడిపోయినా... రెండో గేమ్‌లో పుంజుకొని గెలిచాను. నిర్ణాయక ‘అర్మగెడాన్’ గేమ్‌లో నల్లపావులతో ఆడాల్సి రావడం... ‘డ్రా’ చేసుకుంటే టైటిల్ ఖాయమయ్యే స్థితిలో ఈ గేమ్‌లో ఆరంభం నుంచే మంచి స్థితిలో నిలిచి చివరకు అనుకున్న ఫలితం సాధించాను.
ఫలించిన నిరీక్షణ...
2001లో నేను అండర్–20 ప్రపంచ జూనియర్ చాంపియన్‌గా నిలిచా. ఆ తర్వాత పలుమార్లు ప్రపంచ చాంపియన్íÙప్‌లలో పాల్గొన్నాను. కొన్నిసార్లు ఆరంభ దశలోనే వెనుదిరిగాను. మరి కొన్నిసార్లు కాంస్యం, రజతంతో సరిపెట్టుకున్నాను. ఐదేళ్ల క్రితం పెళ్లి కావడం... ఆ తర్వాత పాప పుట్టడంతో రెండేళ్లపాటు ఆటకు దూరమయ్యాను. గత ఏడాది పునరాగమనం చేశా. సంవత్సరం తిరిగేలోపు ప్రపంచ టైటిల్ సాధించడంతో చాలా సంతోషంగా ఉన్నాను. 18 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రపంచ చాంపియన్ కావడం గొప్ప అనుభూతినిస్తోంది. ర్యాపిడ్ ఫార్మాట్‌లో విశ్వకిరీటం లభించినప్పటికీ.... క్లాసికల్ ఫార్మాట్‌లో ప్రపంచ టైటిల్ వేటను కొనసాగిస్తాను.
నా కుటుంబ సభ్యులకు అంకితం...
ఈ ప్రపంచ టైటిల్‌ను నా కుటుంబ సభ్యులకు అంకితం ఇస్తున్నాను. పునరాగమనంలో తల్లిదండ్రులు కోనేరు అశోక్, లత... భర్త దాసరి అన్వేష్ ఎంతో మద్దతు ఇస్తున్నారు. వారి సహకారం లేకపోయుంటే నేను మళ్లీ కెరీర్ కొనసాగించేదాన్ని కాదు. ఇప్పటికీ నేను రోజూ ఐదారు గంటలు నాన్న అశోక్ పర్యవేక్షణలోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. నా ఆటతీరులోని లోపాలను ఎప్పటికప్పుడు ఆయన సరిదిద్దుతున్నారు. నేను టోర్నమెంట్‌లు ఆడేందుకు విదేశాలకు వెళ్లిన సమయంలో నా రెండేళ్ల పాప అహానాను అమ్మా, నాన్న చూసుకుంటారు.
కొన్నేళ్లు తీవ్రంగా కష్టపడాల్సిందే...
దాదాపు 25 ఏళ్లుగా చెస్ ఆడుతున్నాను. నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ఎంతో మార్పు వచి్చంది. మనలో సహజసిద్ధమైన ప్రతిభ ఉంటే కొన్నేళ్లు తీవ్రంగా కష్టపడితే తప్పకుండా ఉన్నతస్థితికి చేరుకుంటాం. కెరీర్ ఆరంభంలో ఎదురయ్యే ఒడిదుడుకులకు తట్టుకొని స్థిరంగా నిలబడాలి. అప్పడే మంచి భవిష్యత్ ఉంటుంది. అయితే విదేశీ కోచ్‌ల వద్ద శిక్షణ వ్యవహరం చాలా ఖరీదుతో కూడుకున్నది. నాన్న అశోక్ రూపంలో నాకు మంచి కోచ్ లభించడంతో నా కెరీర్‌లో విదేశీ కోచ్‌ల వద్ద శిక్షణ తీసుకోవాల్సిన అవసరం రాలేదు.
పక్కా వ్యవస్థ ఉండాలి....
గతంతో పోలిస్తే ఇప్పుడు భారత్‌లో చెస్‌కు ఆదరణ ఎంతో పెరిగింది. అయితే ఇప్పటికీ మనవద్ద చెస్ చాంపియన్‌లను తయారు చేసే పక్కా వ్యవస్థ లేదనే చెప్పాలి. బ్యాడ్మింటన్‌లో పుల్లెల గోపీచంద్ అకాడమీ మాదిరిగా చెస్‌లోనూ ఉంటే బాగుంటుంది. చైనా, రష్యాలలో జాతీయ జట్లకు రెగ్యులర్ కోచ్‌లు ఉంటారు. అందుకే ఆ దేశాల నుంచి రెగ్యులర్‌గా మేటి ఆటగాళ్లు తెరపైకి వస్తుంటారు. భారత్‌లో ఇప్పటివరకు వచి్చన గ్రాండ్‌మాస్టర్లు, చాంపియన్స్ తమ స్వశక్తితో పైకి వచి్చన వాళ్లే. విజయాలు సాధించాక సన్మానాలు చేసే బదులు చాంపియన్స్ తయారయ్యేలా వ్యవస్థను రూపొందించాలి. ఇప్పటికైతే వ్యక్తిగతంగా చెస్ అకాడమీ ఏర్పాటు చేసే ఆలోచన లేదు. వచ్చే ఏడాది కోసం ప్రత్యేకంగా ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకోలేదు. బరిలో దిగే టోర్నీలలో గొప్ప ప్రదర్శన చేయాలని అనుకుంటున్నాను.
‘బ్లిట్జ్’లో సంయుక్తంగా రెండో స్థానంలో...
ర్యాపిడ్ విభాగంలో చాంపియన్‌గా నిలిచిన కోనేరు హంపి బ్లిట్జ్ విభాగంలోనూ ఆకట్టుకుంది. నిరీ్ణత 17 రౌండ్లకుగాను ఆదివారం తొమ్మిది రౌండ్‌లు జరిగాయి. తొమ్మిది రౌండ్‌ల పూర్తయ్యాక హంపి 7 పాయింట్లతో అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా), దరియా చరోచ్‌కినా (రష్యా), అలీనా కష్లిన్‌స్కాయ (రష్యా)లతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. 8 పాయింట్లతో కాటరీనా లాగ్నో (రష్యా) అగ్రస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 6.5 పాయింట్లతో మరో ఆరుగురితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచింది. నేడు మిగతా ఎనిమిది రౌండ్‌లు జరుగుతాయి. బ్లిట్జ్ ఓపెన్ విభాగంలో 10 రౌండ్‌లు పూర్తయ్యాక భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి 7.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. నేడు మిగతా 11 రౌండ్‌లు జరుగుతాయి.
హంపికి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందన
సాక్షి, అమరావతి: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ గెల్చుకున్న తొలి భారతీయ చెస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. మాస్కోలో శనివారం రాత్రి జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో చైనా ప్లేయర్ లీ టింగ్‌జిపై హంపి గెలిచి విశ్వవిజేతగా అవతరించింది. హంపి సాధించిన విజయం రాష్ట్ర, దేశ ప్రజలకు గర్వకారణమని జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. హంపికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment