సమర్‌కండ్ (ఉజ్బెకిస్తాన్): ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి రెండో రోజూ అద్భుత ఆటతో ఆకట్టుకుంది. తొలి రోజు నాలుగు రౌండ్ల తర్వాత మూడు పాయింట్లతో 15వ ర్యాంక్‌లో ఉన్న హంపి... రెండో రోజు రెండో స్థానానికి ఎగబాకింది. బుధవారం హంపి మూడు గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని 8 రౌండ్ల తర్వాత 6.5 పాయింట్లతో మో జై (చైనా)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానానికి చేరుకుంది.
7 పాయింట్లతో అనస్తాసియా బొద్నారుక్ (రష్యా) అగ్రస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన యువతార నూతక్కి ప్రియాంక కూడా అద్భుతంగా ఆడింది. తొలి రోజు 2 పాయింట్లతో 61వ ర్యాంక్‌లో ఉన్న ప్రియాంక బుధవారం ఆడిన నాలుగు గేముల్లోనూ గెలిచి 6 పాయింట్లతో 10వ ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం. భారత్‌కే చెందిన వైశాలి, దివ్య దేశ్‌ముఖ్ 5 పాయింట్లతో వరుసగా 23, 31వ ర్యాంక్‌లో... ద్రోణవల్లి హారిక 4.5 పాయింట్లతో 40వ ర్యాంక్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment