
చెన్నై: వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్... ఆ వెంటనే జరిగిన బ్లిట్జ్ టోర్నీలో మూడో స్థానంలో నిలిచాడు. ఇందులో జరిగిన 21 గేమ్‌లలో అతను ఒక్కటి మాత్రమే ఓడాడు. తన దృష్టిలో ఇది చాలా గొప్ప ప్రదర్శనగా ఆనంద్ విశ్లేషించాడు. ‘ఇంతటి పెద్ద ఈవెంట్‌లో నేను ఒక గేమ్ మాత్రమే ఓడాను. వరుసగా మూడు రోజులు ర్యాపిడ్ ఆడి ఆ వెంటనే రెండు రోజులు 21 బ్లిట్జ్ గేమ్‌లు ఆడాల్సిన స్థితిలో దానిని పెద్ద ఘనతగా చెప్పవచ్చు.
ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాలు రెండింటిలోనూ పోడియంపై నిలబడగలిగాను. నాకు తెలిసి చాలా కొద్ది మందికి మాత్రమే ఇది సాధ్యమైంది. గతంలో ఇలాంటి సమయంలో నేను కీలక దశలో పాయింట్లు కోల్పోయి వెనుకబడేవాడిని. ఈసారి మాత్రం ఎలాంటి తప్పు చేయలేదు. ఇటీవల ఈ రెండు ఫార్మాట్‌లలో నాకు మంచి ఫలితాలు రాలేదు. దానిని సవరించే ప్రయత్నం చేశాను. నిజాయితీగా చెప్పాలంటే ఒకదాంట్లో బాగా ఆడగలననుకున్నాను. కానీ రెండింటిలో మంచి ఫలితాలు రావడం చాలా సంతోషంగా ఉంది’ అని ఆనంద్ వ్యాఖ్యానించాడు.