
చెన్నై: ప్రపంచకప్ చెస్ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ వరకు చేరిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద తన స్వస్థలం చెన్నై చేరుకున్నాడు. ప్రతిష్టాత్మక చదరంగ వేదికపై తనదైన ముద్ర వేసి తిరిగొచ్చిన ఈ 18 ఏళ్ల కుర్రాడిని సొంత నగరం ఆత్మీయంగా అక్కున చేర్చుకుంది. అతనికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఒకవైపు ఆత్మీయులు, సన్నిహితులు ఆనందంగా తమవాడికి వెల్‌కమ్ చెప్పగా, మరోవైపు తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
ఆ రాష్ట్ర సాంప్రదాయ నృత్యాలు కరగట్టం, ఒయిలట్టంలతో విమానాశ్రయం బయట కళాకారులు ప్రజ్ఞానందకు స్వాగతం పలికారు. పూలు, శాలువాలు, పుష్పగుచ్చాలతో మిత్రులు, అభిమానులు ప్రజ్ఞను ముంచెత్తారు. ‘నాకు లభించిన ఈ స్వాగతం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను’ అంటూ జాతీయ పతాకాన్ని చేతిలో ప్రదర్శిస్తూ ప్రజ్ఞానంద వ్యాఖ్యానించాడు. అతని తల్లి నాగలక్ష్మి కూడా తన ఆనందాన్ని దాచుకోలేకపోయింది.
అనంతరం ప్రజ్ఞానంద, అతని తల్లిదండ్రులు నాగలక్ష్మి, రమేశ్‌బాబులను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞానందకు జ్ఞాపికతోపాటు రూ. 30 లక్షలు నగదు పురస్కారం అందజేశారు. అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగిన ‘ఫిడే’ వరల్డ్ కప్ ఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ చేతిలో ఓడిన ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు.