
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్‌ఫీల్డ్ కప్ గ్రాండ్ చెస్ టూర్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ సంచలన ఫలితంతో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో ప్రజ్ఞానంద 36 ఎత్తుల్లో భారత్‌కే చెందిన క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్‌ను ఓడించాడు. ఈ ఫలితంతో ప్రజ్ఞానంద ప్రపంచ చెస్ లైవ్ రేటింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకోవడం విశేషం.
క్వీన్స్ గాంబిట్ పద్ధతిలో మొదలైన ఈ గేమ్‌లో ప్రజ్ఞానంద ఎత్తులకు సమాధానం ఇచ్చేందుకు గుకేశ్ తీవ్రంగా ఆలోచించాల్సి వచ్చింది. ఒకదశలో సమయాభావంవల్ల గుకేశ్ దీటైన ఎత్తులు వేయలేకపోయాడు. చివరకు 36 ఎత్తులు ముగిశాక గుకేశ్ ఓటమిని అంగీకరించాడు. 10 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య 9 రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది.
మరోవైపు లెవోన్ అరోనియన్ (అమెరికా) 41 ఎత్తుల్లో నొదిర్బెక్ అబ్దుసత్తోరోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందగా... సో వెస్లీ (అమెరికా)–సామ్ సెవియాన్ (అమెరికా) మధ్య గేమ్ 56 ఎత్తుల్లో... అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)–మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్) గేమ్ 58 ఎత్తుల్లో... ఫాబియానో కరువానా (అమెరికా)–జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్) గేమ్ 57 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి.