తల్లి నాగలక్ష్మి, కొడుకు ప్రజ్ఞానందతో నాగలక్ష్మి
చదరంగంలో పావులు కదపాలంటే బుద్ధికి బృహస్పతిలా ఉండాలి. కాని ఆ బృహస్పతిని కని, పెంచడానికి అమ్మ అమ్మలా ఉంటే చాలు. అమ్మకు ఎత్తుకు పై ఎత్తు తెలియదు ప్రేమ తప్ప. తన బిడ్డను రాజు చేయాలనే తపన తప్ప. అందుకు తాను బంటుగా మారేందుకు సిద్ధం కావడం తప్ప. చెస్ వరల్డ్ కప్ 2023లో సంచలనంగా నిలిచిన ఆర్. ప్రజ్ఞానందకు రాజుగా, బంటుగా ఉంటూ తీర్చిదిద్దిన తల్లి నాగలక్ష్మి కథ ఇది.
అజర్‌బైజాన్‌లో జరిగిన ‘చెస్ వరల్డ్ కప్ 2023’ ఫైనల్స్‌లో ఒక అడుగు దూరంలో టైటిల్ కోల్పోయాడు 18 ఏళ్ల ప్రజ్ఞానంద. అతడు ఓడినా గెలిచినట్టే. ప్రపంచ దేశాల నుంచి 206 మంది గ్రాండ్ మాస్టర్లు పాల్గొన్న ఈ భారీ వరల్డ్ కప్‌లో ఇంత చిన్న వయసులో రన్నరప్‌గా నిలవడం సామాన్యం కాదు. కాకలు తీరిన యోధులను ఓడించి మరీ ఈ స్థానాన్ని దక్కించుకోవడమే కాదు దాదాపు 66 లక్షల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. భారతదేశం గర్వించేలా చెస్‌లో వెలుగులీనుతున్న ఈ కుర్రవాడి విజయం వెనుక అతని తల్లి నాగలక్ష్మి ఉంది. అందుకే చెస్ అభిమానులే కాదు దేశదేశాల గ్రాండ్ మాస్టర్లు కూడా ప్రజ్ఞానందకు వెన్నంటి వుంటూ తోడ్పాటునందిస్తున్న నాగలక్ష్మిని ప్రశంసిస్తున్నారు. ఆమెను చూసి ముచ్చట పడుతున్నారు.
టీవీ అలవాటు మాన్పించడానికి
చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం రమేశ్ బాబు, నాగలక్ష్మిలకు కుమార్తె వైశాలి పుట్టాక ప్రజ్ఞానంద పుట్టాడు. ప్రజ్ఞానందకు నాలుగున్నర ఏళ్లు ఉన్నప్పుడు వైశాలి ఎక్కువగా టీవీ చూస్తున్నదని కూతురి ధ్యాస మళ్లించడానికి చెస్ బోర్డు తెచ్చి పెట్టింది నాగలక్ష్మి. వైశాలి చెస్ ఆడుతుంటే చిన్నారి ప్రజ్ఞా కూడా ఆడటం మొదలెట్టాడు. అతడు చెస్ నేర్చుకున్న పద్ధతి, అంత చిన్న వయసులో గెలుస్తున్న తీరు చూస్తే అతడు బాల మేధావి అని తల్లికి అర్థమైంది. మరోవైపు వైశాలి కూడా చెస్‌లో రాణించసాగింది. ఇక నాగలక్ష్మి తన జీవితాన్ని తన ఇద్దరు పిల్లల ఆట కోసం అంకితం చేయాలని నిశ్చయించుకుంది.
అనుక్షణం వెన్నంటే
ప్రజ్ఞానంద ఏడేళ్ల వయసుకే అండర్ సెవెన్‌లో జాతీయ టైటిల్ గెలిచాడు. పదేళ్ల వయసుకు ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యాడు. 12 ఏళ్లకు గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. అప్పుడైనా ఇప్పుడైనా ఉదయం నుంచి రాత్రి వరకూ చెన్నైలో వేరే దేశంలో అతని వెన్నంటే ఉంటుంది నాగలక్ష్మి. ‘ప్రజ్ఞా ఏ పోటీకి వచ్చినా తోడుండే నాగలక్ష్మి ఒక మూల కూచుని దేవుణ్ణి ప్రార్థిస్తూ కూచోవడం మా అందరికీ అలవాటైన దృశ్యం’ అంటాడు త్యాగరాజన్ అనే కోచ్. ఇతను చెస్‌లో ప్రజ్ఞాకు మొదటి పాఠాలు నేర్పాడు. ‘ఉదయం పది నుంచి సాయంత్రం 7 వరకూ చెస్ పాఠాలు నడిచేవి. ఆ తర్వాత రెండు మూడు గంటల హోమ్‌వర్క్ ఇచ్చేవాణ్ణి. ప్రజ్ఞానంద ఇల్లు చేరాక ఆ హోమ్‌వర్క్ అయ్యేవరకు నాగలక్ష్మి తోడు ఉండేదట. రాత్రి పదికి ఇంటి పనులు మొదలెట్టుకుని మళ్లీ ఉదయం ఆరు గంటలకు కొడుకు కోసం నిద్ర లేచేదట’ అని తెలిపాడు అతడు.
చెస్ తెలియని అమ్మ
కొడుకు చెస్‌లో ప్రపంచ విజేత స్థాయి ఆటగాడైనా నాగలక్ష్మికి ఇప్పటి వరకూ చెస్ ఆడటం తెలియదు. ‘మా అబ్బాయిని చూసుకోవడమే నాకు సరిపోతుంది. ఆట ఎక్కడ నేర్చుకోను’ అంటుందామె నవ్వుతూ. ప్రజ్ఞానంద శాకాహారి. బయటి ఆహారం తినడు. అందుకని ఏ ఊరికి ఆట కోసం బయలుదేరినా, విదేశాలకు ప్రయాణం కట్టినా నాగలక్ష్మి చేసే మొదటిపని లగేజ్‌లో ఒక ఇండక్షన్ స్టవ్వు, కుక్కరు, బియ్యం, మసాలాలు పెట్టుకోవడం. ‘ఎక్కడకు వెళ్లినా వాడికి వేడివేడి అన్నం, రసం చేసి పెడతాను.
మైండ్ హాయిగా ఉండి బాగా ఆడాలంటే నచ్చిన ఆహారం తీసుకోవాలి’ అంటుంది నాగలక్ష్మి. చెస్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో అమెరికా దిగ్గజ గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాను ఓడించి ప్రజ్ఞానంద ఫైనల్స్‌కు చేరినప్పుడు నాగలక్ష్మి కళ్లల్లో కనిపించి మెరుపును ఎవరో ఫొటో తీస్తే ఆ ఫొటో వైరల్ అయ్యింది. ‘మావాడు ఆట ఆడేంతసేపు వాడి కళ్లల్లో కళ్లు పెట్టి చూడను. ఎందుకంటే వాడి కళ్లు చూస్తే వాడి ఆట ఎలా సాగుతున్నదో నాకు తెలిసిపోతుంది. నాకు తెలిసిపోయినట్టుగా వాడికి తెలియడం నాకు ఇష్టం ఉండదు’ అంటుంది నాగలక్ష్మి.
కార్ పార్కింగ్‌లో బంధువులు
కూతురు, కొడుకు ఇంట్లో చెస్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇంటిని వీలైనంత నిశ్శబ్దంగా ఉంచుతుంది నాగలక్ష్మి. వాళ్లింట్లో టీవీ పెట్టే ఎంతో కాలమైపోతూ వుంది. ‘మా ఇంటికి బంధువులొచ్చినా, స్నేహితులొచ్చినా కింద కార్ పార్కింగ్ దగ్గరే పలకరించి పంపేస్తాను... పిల్లలు డిస్ట్రబ్ కాకూడదని’ అంటుందామె. అందుకే సెమీ ఫైనల్స్ గెలిచిన ప్రజ్ఞాను అభినందిస్తూ రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ ‘నీకు మీ అమ్మ ఇచ్చే మద్దతు ప్రత్యేకమైనది’ అని ట్వీట్ చేశాడు. నాగలక్ష్మి లాంటి తల్లి ప్రేమకు పిల్లలు ఎప్పుడూ బంట్లే. వారి మనసులో ఆ తల్లి ఎప్పుడూ రాజే.
Comments
Please login to add a commentAdd a comment