ఆకివీడు వద్ద ప్రవహిస్తున్న ఉప్పుటేరు
ఆకివీడు: స్వచ్ఛమైన ఈ జలసిరులు ఇక కన్పించవేమో!. ఈ పచ్చదనం భవిష్యత్‌కు వెచ్చదనంగా మారుతుందేమో!. చల్లటి ఆరోగ్యవంతమైన గాలులు ఇక వీయవేమో!. కొల్లేరు సరస్సు వల్లే సహజసిద్ధంగా ఏర్పడిన ఉప్పుటేరును కాలుష్య తిమింగలం మింగేయనుందా! అనే భయాందోళన సరిహద్దు గ్రామాల ప్రజల్లో ఏర్పడింది. ఉప్పుటేరు కూడా కాలుష్యానికి గురికానుందని సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొల్లేరు ముఖ ద్వారం నుంచి చినగొల్లపాలెం వరకూ ఉన్న ఉప్పుటేరులో గోదావరి, కృష్ణా నదుల మిగులు జలాలు కలుస్తాయి. ఏడాదిలో పది నెలలపాటు ఈ జలాలు కలవగా మిగిలిన రెండు నెలల్లో సముద్రపు నీరు ఎదురు ప్రవహించి ఉప్పుటేరులోని వ్యర్థాల్ని తీసుకుపోతుంది.
సముద్ర జలాలు కలవడంతో ఉప్పు, నదీ జలాల సంగమంతో ఏరుగా పూర్వీకులు ఉప్పుటేరుగా నామకరణం చేశారు. ఉప్పుటేరును డ్రెయిన్‌గా కాకుండా ఏరుగానే ప్రజలు భావిస్తూ, దీని నీటిని నేటికీ వినియోగిస్తూనే ఉన్నారు. ఒక దశలో ఉప్పుటేరుపై మినీ జలవిద్యుత్ కేంద్రం నిర్మించాలన్న యోచన కూడా పాలకులకు కలిగింది. కృష్ణా జిల్లాలోని ఉప్పుటేరు వెంబడి ఉన్న గ్రామాలు, పశ్చిమ డెల్టాలోని పలు గ్రామాలు ఈ నీటినే వినియోగించుకుంటున్నాయి. ఎత్తిపోతల పథకం కింద నీటిని తోడుకుని సాగు చేస్తున్నారు. వేలాది ఎకరాల ఆక్వా సాగు కూడా ఉప్పుటేరుపై కొనసాగుతోంది. కొన్ని గ్రామాల ప్రజలు ఉప్పుటేరులోని నీటిని వాడకానికి, దుస్తులు ఉతుక్కునేందుకు వినియోగించుకుంటున్నారు.
ఉప్పుటేరు స్వరూపం..
కొల్లేరు సరస్సు ముఖ ద్వారం పందిరిపల్లి గూడెం వద్ద 1వ మైలు రాయి నుంచి సముద్రపు ముఖద్వారం వద్ద 49వ మైలు రాయి వరకూ ఉప్పుటేరు ప్రవహిస్తోంది. సుమారు 68 కిలోమీటర్ల మేర (49 మైళ్ల) దూరం వరకూ ఉప్పుటేరు జీవధారగా ప్రవహిస్తోంది. 750 మీటర్ల నుంచి 1200 మీటర్ల వెడల్పులోనూ, 36 అడుగులు లోతులో ఉప్పుటేరు 16 వేల క్యూసెక్కుల నీటితో నిండి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉప్పుటేరు పూడుకుపోవడంతో కేవలం 28 అడుగుల లోతులోనూ, 8 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో కుంచించుకుపోయింది. పలు చోట్ల మేటలు వేసి ఉప్పుటేరు పూడుకుపోతోంది. దీంతో నీటి ప్రవాహం మందగిస్తోంది. సముద్రపు పోటు సమయంలో ఉప్పునీరు అధికంగా ఎదురు ప్రవహిస్తోంది.
దిగువ ప్రాంతంలో ఆక్వా పరిశ్రమ?
ఉప్పుటేరు దిగువ ప్రాంతంలో ఆక్వా పరిశ్రమ నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల రైతులు ఇటీవల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆక్వా కాలుష్యం నుంచి ఉప్పుటేరును రక్షించి సరిహద్దు గ్రామాలను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఆక్వా వ్యర్థాలు వేసవిలో ఉప్పుటేరు గుండా కొల్లేరు సరస్సులోకి ప్రవేశించే అవకాశం కూడా ఉందని వారు చెబుతున్నారు. ఆక్వా వ్యర్థాలకు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment