నారాయణ వైద్యకళాశాల వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ సాక్షి, అమరావతి: ‘తమ బిడ్డలకు వైద్య విద్య థియరీ పరీక్షల్లో 90 శాతం, 88 శాతం మార్కులొచ్చాయి. అయితే ప్రాక్టికల్ పరీక్షల్లో మాత్రం ఫెయిల్ చేశారు.’ ఇది అన్యాయమంటూ పలువురు వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం నగరంలోని నారాయణ మెడికల్ కళాశాల వద్ద ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలు సరిగా ప్రాక్టికల్స్ చేయలేదని యాజమాన్యం చెబుతోందని తెలిపారు. అయితే, థియరీ పరీక్షల్లో 90, 88, 85 మార్కులు ఎలా వచ్చాయో తెలపాలంటూ డిమాండ్ చేశారు.
వైద్యకళాశాల డీన్, అధ్యాపకులు మళ్లీ పరీక్షలు రాసుకోండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు తమ వద్దకు ట్యూషన్‌కు రావాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారని ఆరోపించారు. కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది.
వైద్య కళాశాల వద్ద ఆందోళన అనంతరం పలువురు మెడికోల (వైద్య విద్యార్థులు) తల్లిదండ్రులు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. మరోవైపు కళాశాల డీన్ మాట్లాడుతూ గత నెలలో నారాయణ కళాశాలలో నిర్వహించిన ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ పార్ట్–2 ప్రాక్టికల్ పరీక్షల్లో కొంత మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారన్నారు. ఇందుకు కళాశాలను నిందించడం దురదృష్టకరమన్నారు.
అంతమంది ఫెయిల్ అవ్వడానికి కారణమేంటి?
ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పార్ట్–2 పరీక్షల్లో నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఫెయిల్ కావడంతో పలువురు తల్లిదండ్రులు ఈ విషయాన్ని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ బాబ్జీ దృష్టికి తీసుకువచ్చారు. యాజమాన్యం చేసిన తప్పిదాల వల్లే తమ పిల్లలు ఫెయిల్ అయ్యారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అయ్యారో తెలియజేయాలని నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్‌ను విశ్వవిద్యాలయం వివరణ కోరింది. కళాశాలలో సుమారు 250 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉండగా, 106 మంది పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. వీరిలో 56 మంది ప్రాక్టికల్స్, థియరీ రెండింటిలో ఫెయిల్ అవ్వగా, 50 మంది థియరీలో ఉత్తీర్ణత సాధించి, ప్రాక్టికల్స్‌లో మాత్రమే ఫెయిల్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment