ఎంబీబీఎస్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో అక్రమాలు | Irregularities in MBBS Supplementary Examinations | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో అక్రమాలు

Published Sun, May 2 2021 5:03 AM | Last Updated on Sun, May 2 2021 5:03 AM

Irregularities in MBBS Supplementary Examinations - Sakshi

నెల్లూరు(క్రైమ్‌): ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి నెల్లూరు నారాయణ మెడికల్‌ కాలేజీలో జరుగుతున్న అక్రమాలు బయటపడ్డాయి. పరీక్షల్లో పాస్‌ అయ్యేలా చూస్తానంటూ విద్యార్థుల నుంచి అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. విద్యార్థుల జవాబు పత్రాలు తీసుకుని తన ఇంట్లోనే పరీక్షలు రాయిస్తూ.. చివరకు పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. వివరాలు.. నెల్లూరు నారాయణ మెడికల్‌ కాలేజీలో డాక్టర్‌ శింగంశెట్టి భాస్కర్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. సరస్వతీ నగర్‌లోని పూజ సత్యదేవమ్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. ఆయన ప్లాట్‌లో ఎంబీబీఎస్‌ పరీక్షలకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయంటూ నెల్లూరు దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్‌స్పెక్టర్‌ మిద్దె నాగేశ్వరమ్మ తన సిబ్బందితో కలిసి భాస్కర్‌ ప్లాట్‌పై శుక్రవారం దాడి చేశారు. భాస్కర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తుల్ని, ఐదుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మెసెంజర్‌ను మేనేజ్‌ చేసి..
పట్టుబడిన ఐదుగురు విద్యార్థులు ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నారు. రూ.3.50 లక్షలిస్తే పరీక్షలు పాస్‌ చేయిస్తానంటూ భాస్కర్‌రావుతో పాటు ప్రసాద్, మహేంద్ర, జయకుమార్‌ అనే వ్యక్తులు విద్యార్థులతో ఒప్పందం చేసుకున్నారు. వీరి పథకం ప్రకారం.. విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వాలి. జవాబు పత్రాల్లో ఖాళీ ఉంచి ఇన్విజిలేటర్‌కు ఇచ్చేయాలి. ఈ మేరకు ఐదుగురు విద్యార్థులూ శుక్రవారం బయోకెమిస్ట్రీ పేపర్‌–2 పరీక్షకు హాజరై.. ఖాళీ జవాబు పత్రాలు ఇచ్చేశారు. కాలేజీ సిబ్బంది పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను బండిల్స్‌గా చేసి స్పీడ్‌ పోస్టు ద్వారా ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి పంపిస్తుంటారు. దీనిని భాస్కర్‌ ముఠా తమకు అనుకూలంగా మలుచుకుంది. స్పీడ్‌ పోస్టు తీసుకెళ్లే మెసెంజర్‌ను కూడా తమ వైపునకు తిప్పుకున్నారు. అతని వద్ద ఉన్న బండిల్స్‌ నుంచి తాము ఒప్పందం కుదుర్చుకున్న విద్యార్థుల జవాబు పత్రాలు తీసుకునేవారు. అనంతరం భాస్కర్‌ తన ఇంటికి తీసుకెళ్లి ఆ జవాబు పత్రాలను మళ్లీ విద్యార్థులతో నింపించేవాడు. పని పూర్తయిన తర్వాత వాటిని యథావిధిగా మెసెంజర్‌కు ఇచ్చేసేవాడు. అతను రాత్రి 7.30కు వాటిని విజయవాడకు పంపేవాడు. శుక్రవారం కూడా ఇలాగే జవాబు పత్రాలను తీసుకుని విద్యార్థులతో పరీక్షలు రాయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 

ఇంకా ఎంతమంది ఉన్నారు?
అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ భాస్కర్, అతని బృందంతో పాటు, ఐదుగురు విద్యార్థులను ఠిపోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఎంత కాలం నుంచి సాగుతోంది? ఇంకా ఎంత మంది ఈ దందాలో ఉన్నారు? ఎంత మంది విద్యార్థుల నుంచి నగదు వసూలు చేశారు? తదితర వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement