సాక్షి, హైదరాబాద్: వైద్యవిద్యలో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్) విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ఈ ఏడాది నుంచే దాన్ని అమలులోకి తేవాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం ఎంబీబీఎస్ పాస్‌కు, తర్వాత రిజిస్ట్రేషన్, మెడికల్ ప్రాక్టీస్‌కు కూడా ఈ పరీక్ష పాస్ కావడం తప్పనిసరి. అలాగే పీజీ మెడికల్ సీటులో ప్రవేశం కూడా నెక్ట్స్ అర్హతతోనే ఉంటుంది. అంటే నీట్ పీజీ పరీక్ష రద్దవుతుంది.
అలాగే విదేశీ వైద్యవిద్యకు గుర్తింపు కూడా ఈ పరీక్ష ద్వారానే ఉంటుంది. అంటే వీటన్నింటికీ ఇదే కీలకమైన పరీక్షగా ఉంటుంది. నెక్ట్స్‌ను ఈ ఏడాది ఎంబీబీఎస్ పూర్తయ్యే విద్యార్థులతో ప్రారంభిస్తారు. నెక్ట్స్–1, నెక్ట్స్–2 అనే పరీక్షలు నిర్వహిస్తారు. నెక్ట్స్–1 ఏటా మే, నవంబర్ నెలల్లో రెండుసార్లు ఉంటుంది. ఆ పరీక్ష జరిగిన నెలలోపే ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఏడాది మొదటిసారిగా నవంబర్‌లో పరీక్ష జరగనుంది. ఇప్పుడు ఎంబీబీఎస్ కోర్సు పూర్తయ్యేవారు ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. నెక్ట్స్–1 తర్వాత ప్రాక్టికల్స్ ఉంటాయి.
ఆ తర్వాత హౌస్‌సర్జన్ పూర్తిచేశాక నెక్ట్స్–2ను జూన్ మూడో వారం లేదా డిసెంబర్‌లో నిర్వహిస్తారు. నెక్ట్స్–2కు సప్లమెంటరీ పరీక్ష ఉంటుంది. ఏటా మార్చి లేదా సెప్టెంబర్‌లో నిర్వహిస్తారు. నెక్ట్స్–1ను దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తారు. నెక్ట్స్–2 పూర్తిగా ప్రాక్టికల్ పరీక్షే. దీన్ని సంబంధిత ఆరోగ్య విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
అర్హత కటాఫ్ 50 శాతం..
నెక్ట్స్–1 పరీక్షకు అర్హత కటాఫ్ 50% ఉంటుంది. అప్పుడు ఉత్తీర్ణత సాధించినట్లుగా పరిగణిస్తారు. ఇంటర్న్‌షిప్ ప్రారంభించడానికి అర్హులు. ఇంటర్న్‌షిప్ తర్వాత పీజీ సీట్లను కేటాయించడంలో నెక్ట్స్–1లో సాధించిన స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటారు. పీజీ ప్రవేశ ర్యాంకింగ్ కోసం నెక్ట్స్ పరీక్ష స్కోర్ మూడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. అయితే నెక్ట్స్–2 పరీక్ష పీజీ సీట్ల కేటాయింపునకు దోహదం చేయదు. ఇది అర్హత పరీక్ష మాత్రమే.
నాణ్యతను పెంచడమే లక్ష్యంగా...
అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా వైద్యవిద్యలో నాణ్యతను పెంచడమే లక్ష్యంగా ఎన్‌ఎంసీ నెక్ట్స్ పరీక్షకు శ్రీకారం చుడుతోంది. జాతీయ స్థాయిలో ఏకీకృత పరీక్షను పెట్టడం ద్వారా దేశవ్యాప్తంగా ఒకే నాణ్యమైన వైద్యవిద్యను అందించాలని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినవారికి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (ఎఫ్‌ఎంజీఈ) నిర్వహిస్తున్నారు.
అందులో పాసైతేనే ఇండియాలో డాక్టర్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి, ప్రభుత్వ వైద్య ఉద్యోగాల్లో చేరడానికి అనుమతి ఉంది. అయితే ఎఫ్‌ఎంజీఈ పరీక్ష ఎంతో కఠినంగా ఉండటంతో పరీక్ష రాసే వారిలో 20 శాతానికి మించి అర్హత సాధించలేకపోతున్నారు. దీంతో అనేకసార్లు ఈ పరీక్ష రాయాల్సి వస్తోంది.
చాలా మంది అర్హత సాధించలేక ఇతరత్రా వృత్తుల్లో స్థిరపడిపోయినవారున్నారు. ఇప్పుడు వాళ్లు కూడా నెక్ట్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇది పాస్ కాకుంటే ఎంబీబీఎస్ పట్టా ఇవ్వరు. దేశంలో వైద్యవిద్యకు ఒకే పరీక్షగా, వైద్యవిద్యను క్రమబద్ధీకరించడానికి ఇది నిర్వహించాలన్నది ఎన్‌ఎంసీ ఉద్దేశమని చెబుతున్నారు.
వచ్చే నెల 28న మాక్ టెస్ట్...
నెక్ట్స్‌పై అవగాహనకు ఈ ఏడాది ఎంబీబీఎస్ చదివే విద్యార్థుల కోసం మాక్ టెస్ట్ నిర్వహించాలని ఎన్‌ఎంసీ నిర్ణయించింది. వచ్చే నెల 28న ఆ పరీక్ష నిర్వహిస్తారు. అందుకోసం బుధవారం (జూన్ 28) నుంచి దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు ఎన్‌ఎంసీ సూచించింది. నెక్ట్స్–1 మాక్ టెస్టును ఢిల్లీ ఎయిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
నెక్ట్స్–1ను ఎంబీబీఎస్ థియరీ పరీక్షకు బదులుగా నిర్వహిస్తున్నందున మూడు రోజులపాటు రోజు విడిచి రోజు ఈ పరీక్ష ఉంటుంది. మెడిసిన్ ఆలైడ్ సబ్జెక్టు పరీక్ష 3 గంటలపాటు నిర్వహిస్తారు. 120 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. అలాగే సర్జరీ, ఆలైడ్ సబ్జెక్టుల నుంచి 120 ప్రశ్నలు 3 గంటలపాటు ఉంటుంది. ఓబీజీ 120 ప్రశ్నలు, మూడు గంటలు ఉంటుంది. పీడియాట్రిక్స్ పరీక్ష 60 ప్రశ్నలకు గంటన్నరపాటు ఉంటుంది. ఈఎన్‌టీ పరీక్షకు 60 ప్రశ్నలు... గంటన్నర సమయం ఉంటుంది.
ఆఫ్తాల్మాలజీ పరీక్ష 60 ప్రశ్నలు... మూడు గంటలు ఉంటుంది. ఉదయం సాయంత్రం వేళల్లో పరీక్ష నిర్వహిస్తారు. నెక్ట్స్–2 పరీక్ష పూర్తిగా ప్రాక్టికల్ పరీక్ష మాత్రమే. క్లినికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రోగులను పరీక్షించే పరీక్ష నిర్వహిస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. నెక్ట్స్ పరీక్షకు సంబంధించి కొంత గందరగోళం ఉందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్‌ఎంసీకి లేఖ రాయాలని వర్సిటీ నిర్ణయించింది.
వైద్యవిద్యలో ‘నెక్ట్స్’ లెవెల్
Published Wed, Jun 28 2023 1:51 AM | Last Updated on Wed, Jun 28 2023 1:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment