ప్రైవేటు వైద్య విద్య మరింత భారం | Govt is again 5 percent Increasing the MBBS and BDS Seat fees | Sakshi
Sakshi News home page

ప్రైవేటు వైద్య విద్య మరింత భారం

Published Thu, Jul 12 2018 1:14 AM | Last Updated on Thu, Jul 12 2018 1:14 AM

Govt is again 5 percent Increasing the MBBS and BDS Seat fees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు వైద్య విద్య మరింత భారం కాబోతోంది. బీ, సీ కేటగిరీ ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల ఫీజును ప్రభుత్వం మళ్లీ 5 శాతం పెంచబోతోంది. అందుకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ వద్ద ఉంది. ఆ శాఖ తుది నిర్ణయం తీసుకుంటే త్వరలోనే జోవో విడుదలవనుంది. ఉత్తర్వులొస్తే ఒక్కో విద్యార్థిపై రూ. 5.75 లక్షల వరకు అదనపు భారం పడనుంది. బీ, సీ కేటగిరీల్లోని ఫీజులను 2018–19లో 5 శాతం పెంచాలంటూ ప్రైవేటు మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వానికి నివేదించిన విషయం తెలిసిందే. వారి విన్నపానికి సర్కారు సుముఖత వ్యక్తం చేసిందని, జీవో కోసం ఎదురు చూస్తున్నామని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఫీజు పెంపు జీవో వచ్చే వరకు కౌన్సెలింగ్‌ ఆపాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని కోరుతున్నాయి. అయితే ఇప్పటికే బీ కేటగిరీ సీట్లకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానించిన వర్సిటీ యాజమాన్యాలు సహకరించకపోవడంతో ఆందోళన చెందుతోంది.  

11 కాలేజీల డిమాండ్‌ 
రాష్ట్రంలో 15 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో మొత్తం 2,100 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. అందులో 4 మైనారిటీ కాలేజీల్లో 550 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. ఆ కాలేజీలు పోను మిగిలిన 11 కాలేజీలు (1,550 సీట్లు) 5 శాతం ఫీజు పెంపు కోరుతున్నాయి. ఆ 1,550 సీట్లలో బీ కేటగిరీ 534, సీ (ఎన్నారై) కేటగిరీ 235 సీట్లు ఉన్నాయి. గతేడాది బీ కేటగిరీకి రూ. 11.55 లక్షలు (ఏడాదికి), సీ కేటగిరీకి రూ. 23.10 లక్షలు యాజమాన్యాలు వసూలు చేశాయి. అయితే పీజీ మెడికల్‌ బీ, సీ కేటగిరీ సీట్లకు ఏటా 5 శాతం ఫీజు పెంచాలన్న నిబంధన ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లోని అదే కేటగిరీ సీట్లకూ ఫీజు పెంచాలని యాజమాన్యాలు సర్కారును కోరాయి. ఆ ప్రకారం గతేడాది ప్రభుత్వం ఫీజులు పెంచింది. జీవో లేకున్నా పెంచడంపై అప్పట్లో విమర్శలొచ్చాయి. ఇప్పుడు కూడా ఫీజు పెంపునకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.  

5 శాతం పెంచితే..  
ఫీజు 5 శాతం పెంచితే ఎంబీబీఎస్‌ బీ కేటగిరీ సీటు ఫీజు రూ. 11.55 లక్షల నుంచి రూ. 12.12 లక్షలకు.. సీ కేటగిరీ ఫీజు రూ. 23.10 లక్షల నుంచి రూ. 24.25 లక్షలకు పెరగనుందని ప్రైవేటు మెడికల్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం నేతలు చెబుతున్నారు. పెంపు వల్ల బీ కేటగిరీ విద్యార్థిపై ఐదేళ్లకు రూ. 2.75 లక్షలు.. సీ కేటగిరీ విద్యార్థిపై రూ. 5.75 లక్షలు భారం పడనుంది. ఫీజులు ఇంతలా వసూలు చేస్తున్నా ప్రైవేటు యాజమాన్యాలు డొనేషన్ల పేరుతో మరింత వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. నీట్‌ ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తున్నా డొనేషన్లు ఆగడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్సిటీ ఎదురుచూపు 
ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల కోసం గత నెల 30 నుంచి జూలై 5 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆరోగ్య వర్సిటీ అధికారులు ఇప్పటికే మెరిట్‌ జాబితా కూడా తయారు చేశారు. అయితే వెబ్‌ కౌన్సెలింగ్‌కు ఏర్పాటు చేయాలని, అందుకు ప్రతినిధులను పంపాలని వర్సిటీ చేసిన విజ్ఞప్తిని యాజమాన్యాలు పెడచెవిన పెట్టాయి. ఫీజు పెంపు తర్వాతే ప్రక్రియ కొనసాగించాలని కోరాయి. ప్రైవేటు యాజమాన్యాల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న వర్సిటీ అధికారులు.. విద్యార్థుల మెరిట్‌ జాబితా తయారు చేసుకొని వారి రాకకోసం ఎదురు చూస్తున్నారు. కౌన్సెలింగ్‌ పూర్తి చేసి వచ్చే నెల ఒకటి నుంచే తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement