
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య విద్య కళాశాలల అధ్యాపకులను ఇకనుంచి నేరుగా నియామకాలు చేపట్టనున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇది మొదటిసారి కానుంది. ఇప్పటివరకూ ఈ నియామకాలను భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో సంబంధం లేకుండా భర్తీ చేపట్టాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి ఇటీవల ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో నల్లగొండ, సూర్యాపేటల్లో మరో రెండు కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా 40 నుంచి 50 మంది ప్రొఫెసర్లు పదవీ విరమణ చేస్తుంటారు. దీంతో కళాశాలల్లో అధ్యాపకుల కొరత వేధిస్తోంది.
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య విద్య కళాశాలలో 2,700 మంది అధ్యాపకులు ఉన్నారు. వీరిలో 2019 చివరి నాటికి మరో 50 మంది పదవీ విరమణ చేయనున్నారు. దీంతో అధ్యాపకుల కొరత 48 శాతానికి చేరుకుంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతంలో 459 మంది వైద్య విద్య అధ్యాపకుల భర్తీని టీఎస్‌పీఎస్సీ చేపట్టగా కొందరు వైద్యులు హైకోర్టుకు వెళ్లడంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. అధ్యాపకుల కొరతను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో పనిచేస్తున్న కొందరు వైద్యులను వారి సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని డీఎంఈ పరిధిలో విలీనమయ్యే వెసులుబాటు కల్పించారు. అయినా కొరతను పూర్తి స్థాయిలో అధిగమించలేకపోతున్నారు.
తగ్గిపోతున్న వైద్య విద్య ప్రమాణాలు..
అధ్యాపకుల కొరత కారణంగా వైద్య విద్య ప్రమాణాలు తగ్గిపోవడంతోపాటు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా అధ్యాపకుల పదవీవిరమణ వయసును పెంచాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు అధ్యాపకులు ఆందోళనకు దిగడంతో సీఎం ఆదేశాల తో తాత్కాలికంగా పక్కన పెట్టేశారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతుంది. పరిస్థితిని అధిగమించాలంటే నేరుగా నియామకాలు చేపట్టడం ఒక్కటే మార్గమని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామకాలు ఆలస్యమవుతున్నందున ఆయా శాఖలకు నియామక అనుమతులు కల్పిస్తానని చెప్పారు. దీని దృష్ట్యా వైద్య విద్య అధ్యాపకులను నేరుగా నియమించుకునే వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వానికి డీఎంఈ ఇటీవల లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment