
సాక్షి, అమరావతి: వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి ప్రతిభావంతులైన రిజర్వుడ్ కేటగిరీ (ఎంఆర్‌సీ) అభ్యర్థికి కేటాయించిన సీటు ఖాళీ అయితే, ఆ సీటును మరో రిజర్వుడ్ కేటగిరి అభ్యర్థితోనే భర్తీ చేయాలంటూ 2001లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 550 అమలు కావడం లేదంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో జరిగే ప్రవేశాలు పూర్తి పారదర్శకంగా జరిగేందుకు వీలుగా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ కమిటీలో వైద్య విద్య రంగంలోని ఇద్దరు నిపుణులకు, ఇద్దరు విశ్రాంత ఐఏఎస్ అధికారులకు, ఇద్దరు హైకోర్టు సీనియర్ న్యాయ వాదులకు స్థానం కల్పించాలని సూచిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. వైద్య విద్య సీట్ల భర్తీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) ఇస్తున్న 10 శాతం రిజర్వేషన్లు అమలుకు నోచుకోవడం లేదని,ఈ 10 శాతం రిజర్వేషన్లలో 50 శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయిస్తున్నారని పేర్కొంటూ దాఖలైన వ్యాజ్యాలను కూడా ధర్మాసనం కొట్టేసింది.
Comments
Please login to add a commentAdd a comment