సాక్షి, అమరావతి: ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) విద్యా, ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తెచ్చిన చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన చట్టాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై జూన్ 26న తుది విచారణ చేపడుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ లోపు కాపులకు మాత్రమే 5 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 26కి వాయిదా వేసింది.
ఈ మేరకు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం పిటిషనర్‌కు పలు సూచనలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుని, ప్రభుత్వంపై ఇతర మార్గాల్లో ఒత్తిడి తేవాలని సూచించింది. లేనిపక్షంలో రిజర్వేషన్ల వ్యవహారంలో కోర్టులో పెండింగ్‌లో ఉందన్న కారణంతో ప్రభుత్వం జాప్యం చేసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వ్యవహారం చాలా సున్నితమైందని వ్యాఖ్యానించింది.
కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించకపోవడం చట్ట విరుద్ధమంటూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. జోగయ్య తరఫున న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలు వినిపిస్తూ, గత ప్రభుత్వ హయాంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తెచ్చిందని, దీనిపై దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టేసిందన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం పాత చట్టాన్ని అమలు చేయడంలేదని అన్నారు.
విద్యా, ఉపాధి అవకాశాల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. మరో న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు జోక్యం చేసుకుంటూ.. కాపులకు మాత్రమే 5 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ తాము గతంలోనే పిల్ దాఖలు చేశామని చెప్పారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు మాత్రమే 5 శాతం రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. కాపులకు రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం.. ఈ వ్యవహారం చాలా సున్నితమైందని, అందువల్ల లోతుగా విచారణ జరుపుతామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment