న్యూఢిల్లీ: నీట్ పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించిన ఓ విద్యార్థినికి ఆలిండియా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సీటు నిరాకరించడం సంచలనమైంది. నీట్-2020లో 66వ ర్యాంక్ పొందిన ఫర్హీన్ కేఎస్‌కు ఎయిమ్స్ సీటు ఇవ్వకపోవడంతో ఆమె టూరిజం శాఖ మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అల్ఫోన్స్‌ను కలిసి గోడు వెళ్లబోసుకుంది. దీనిపై స్పందించిన ఎంపీ అల్ఫోన్స్ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాసి విద్యార్థిని సమస్య పరిష్కరించాలని కోరారు. విషయం ఆరోగ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో తమ పొరపాటును సరిదిద్దుకున్న ఎయిమ్స్ యాజమాన్యం ఎట్టకేలకు ఫర్హీన్ కేఎస్‌కు ప్రవేశం కల్పించింది. కాగా, నీట్‌లో 66 ర్యాంక్ సాధించిన ఫర్హీన్ గడువులోగా క్రిమి లేయర్ సర్టిఫికెట్ సమర్పించలేదన్న కారణంతో ఎయిమ్స్ సీటు నిరాకరించిన సంగతి తెలిసిందే.
పేద కుటుంబంలో టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఎయిమ్స్‌లో చేదు అనుభవం ఎదురవడం దురదృష్టకరమని అల్ఫోన్స్ ఈ సంర్భంగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి చొరవతో ఫర్హీన్‌కు సీటు దక్కిందని, మరి మంచి ర్యాంకులు సాధించినప్పటికీ చిన్నచిన్న కారణాలతో ప్రవేశాలకు దూరమవుతున్నవారి సంగతేంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సమస్యల పరిష్కారానికి ఒక అప్పిలేట్ అథారిటీ ఉండాలని అల్ఫోన్స్ సూచించారు. ఉన్నత చదువులకు సుదూర ప్రాంతాల నుంచి ఢిల్లీ వచ్చే విద్యార్థులంతా మంత్రులను కలవలేరు కదా అని అన్నారు. ప్రవేశాలకు సంబంధించి ప్రాస్పెక్టస్‌లో సవివరంగా చెప్పాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment