సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య యూజీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి గత నెలలో జరిగిన నీట్–21 పరీక్ష ఓఎంఆర్ ఆధారిత ప్రాథమిక కీ శుక్రవారం విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ వెబ్‌సైట్‌లో కీని అందుబాటులో పెట్టింది. ప్రస్తుతం విడుదల చేసిన ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఈనెల 18వ తేదీ వరకు ఆన్‌లైన్లో స్వీకరించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. అనంతరం తుది కీని విడుదల చేస్తారు.
కాగా ఈనెల 20 నుంచి 22వ తేదీల మధ్య ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రాథమిక కీలో ఫిజికల్ సైన్స్ కేటగిరీలో ఒకట్రెండు మినహా మిగతావాటికి సమాధానాలు దాదాపు సరిగ్గానే ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
కటాఫ్ తగ్గొచ్చు..
ఈ సారి ఎంబీబీస్ ప్రవేశాల్లో కటాఫ్ మార్కులు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. గతేడాది కన్వీనర్ కోటాలో సీటు దక్కించుకున్న చివరి అభ్యర్థి మార్కులు 493కాగా, ఈ సారి పేపర్ తీరుతో కటాఫ్ మార్కులు తగ్గొచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా విడుదలైన ప్రాథమిక కీ ఆధారంగా ఇప్పటికే పలు కార్పొరేట్ విద్యా సంస్థలు కటాఫ్ మార్కులపై అంచనా వేశాయి. ఈ ఏడాది 460 మార్కులు వచ్చిన వారికి కన్వీనర్ కోటాలో సీటు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment