సాక్షి, హైదరాబాద్: పేదరికం వల్ల సమాజానికి ఉపయోగపడే వైద్య విద్యను చదువుకోలేకపోతున్నామని ఆందోళనలో ఉన్న ఇద్దరు బాలికలకు మంత్రి కె.తారకరామారావు అండగా నిలిచారు. వారికి ఆర్థిక సహాయం అందించి ఎంబీబీఎస్ చదువాలనుకున్న వారి కలను సాకారం చేశారు. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన ఆవునూరి అఖిల ఇంటర్మీడియట్‌లో 98 శాతం మార్కులతో ఎంబీబీఎస్‌లో సీటు సాధించింది. అఖిల తండ్రి ప్రభాకర్ ఒక రైతు, తల్లి గృహిణి. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో సీటు దక్కించుకున్న అఖిల ఫీజులు ఎలా చెల్లించాలో వారికి అర్థం కాలేదు.ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది.
దీంతో అఖిల విద్యాభ్యాసానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తానని హామీ ఇవ్వడమే కాకుండా.. సోమవారం ఆమెకు అవసరమైన ఫీజుల నిమిత్తం ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్‌లో తనను కలిసిన అఖిల కుటుంబంతో మంత్రి మాట్లాడారు. అండగా ఉంటానని, బాగా చదువుకొని ఉన్నతస్థితికి రావాలని అఖిలకు సూచించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన స్పందన 95 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకుని టీఆర్‌ఆర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది.
స్పందన తల్లిదండ్రులు రోజువారీ కూలి పనులు చేసుకుంటూ ఆమెను చదివించారు. వారి పరిస్థితి కూడా కేటీఆర్ దృష్టికి వచ్చింది. దీంతో స్పందనతో పాటు ఆమె కుటుంబసభ్యులను ప్రగతిభవన్‌కు పిలిపించి ఎంబీబీఎస్‌కు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు. తమ ఎంబీబీఎస్ ఆశ నెరవేరదన్న ఆందోళనతో ఉన్న తమకు, మంత్రి కేటీఆర్ ఆర్థిక సహాయం చేయడంపై అఖిల, స్పందన సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి అందించిన సహాయాన్ని సద్వినియోగం చేసుకుని సమాజానికి తమ వంతు సేవ చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment