కోటా(రాజస్తాన్): రాజస్తాన్‌లోని కోటా పట్టణంలో వైద్య విద్య ప్రవేశ పరీక్ష కోసం కోచింగ్ తీసుకుంటున్న 17 ఏళ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన ముఖానికి ప్లాస్టిక్ బ్యాగ్ చుట్టుకొని ఊపిరాడని స్థితిలో ప్రాణాలు తీసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన మన్‌జోత్ చాబ్రా కోటాలోని ఓ శిక్షణా కేంద్రంలో ‘నీట్’ కోచింగ్ తీసుకుంటున్నాడు. గురువారం ఉదయం తన హాస్టల్ రూమ్‌లో విగతజీవిగా కనిపించాడు. మన్‌జోత్‌కు అతని తల్లిదండ్రులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో వారు హాస్టల్ వార్డెన్‌ను అప్రమత్తం చేశారు.
విద్యార్థి గది తలుపులను బద్దలు కొట్టి చూడగా మృతదేహం కనిపించింది. కోటాలో ఇటీవలి కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోవడంతో హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్‌కి యాంటీ సూసైడ్ పరికరాలు అమర్చారు. దీంతో మన్‌జోత్ తన ముఖానికి, తలకి ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌ని చుట్టుకొని, దానికి ఒక బట్టను గట్టిగా కట్టి ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసు అధికారి ధర్మవీర్ సింగ్ వెల్లడించారు. తన మరణానికి ఎవరూ కారణం కాదంటూ అతడి గదిలో ఒక లేఖ లభ్యమైనట్లు చెప్పారు.
మన్‌జోత్ చాలా తెలివైనవాడని, అందరితో జోక్స్ వేస్తూ సరదాగా ఉంటాడని అతని స్నేహితులు చెప్పారు. కోటాలో ఈ ఏడాది బలవన్మరణం చెందిన విద్యార్థుల సంఖ్య 19కి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఇదే పట్టణంలో 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అఖిల భారత స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు కోటా ప్రసిద్ధి గాంచింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి విద్యార్థులు కోచింగ్ కోసం వస్తుంటారు. చదువుల్లో ఒత్తిడి వల్ల వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment