సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ జాతీయ కోటా సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా మారింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) తప్పిదం కారణంగా సీట్ల భర్తీ ప్రక్రియలో తెలంగాణలోని ఆరు ప్రభుత్వ కాలేజీలు వెబ్‌సైట్‌లో కనిపించకపోవడంతో విద్యార్థులు ఆన్‌లైన్ ఆప్షన్ పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ఆప్షన్ల నమోదుకు గడువు ముగుస్తుండటంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
రాష్ట్రాలను సంప్రదించకపోవడం వల్లే...
వైద్య విద్య డిగ్రీ సీట్ల భర్తీలో ఈ ఏడాది నుంచి తెలంగాణ, ఏపీల్లోనూ జాతీయ కోటా (నేషనల్ పూల్) విధానం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం నీట్ ర్యాంకుల ఆధారంగా తొలుత జాతీయ కోటా సీట్లను భర్తీ చేస్తారు. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఈ ప్రక్రియ చేపడుతుంది. ఎన్‌ఐసీ ఆధ్వర్యంలో సాంకేతిక ప్రక్రియ జరుగుతుంది. రాష్ట్రాలవారీగా కాలేజీలు, సీట్ల వివరాలను నమోదు చేస్తుంది. జాతీయ కోటా సీట్ల భర్తీకి జూన్ 13 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. జూన్ 19 వరకు సీట్ల ఎంపిక కోసం ఆన్‌లైన్ ఆప్షన్‌కు ఎంసీసీ అవకాశం కల్పించింది. రాష్ట్రాలను సంప్రదించకుండానే ఎన్‌ఐసీ వివరాలను పొం దుపరచడంతో ఆన్‌లైన్‌లో కాలేజీలు, సీట్ల వివరాల ను నమోదు చేయడంలో భారీగా తప్పులు దొర్లాయి.
రాష్ట్రంలో 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు (గాంధీ, కాకతీయ, ఉస్మానియా, రిమ్స్ (ఆదిలాబాద్), నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట), ఒక ఈఎస్‌ఐ కాలేజీ ఉండగా ఎంసీసీ వెబ్‌సైట్‌లో తెలంగాణలోని గాంధీ, ఈఎస్‌ఐ కాలేజీలే కనిపిస్తున్నాయి. మిగిలిన 6 ప్రభుత్వ కాలేజీలు జాబితాలో లేవు. సీట్ల కోసం ఆప్షన్లు పెట్టుకోవాలనుకున్న విద్యార్థులకు ఇది ఏమీ అర్థం కావడంలేదు. మొదటి విడత ఆప్షన్ల ప్రక్రియ సోమవారంతో ముగుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల నుంచి ఎంసీసీకి భారీగా ఫిర్యాదులు అందాయి. తీరికగా స్పందించిన ఎంసీసీ తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించింది. ఎన్‌ఐసీ సేకరించిన వివరాలలోనే తప్పులు ఉన్నట్లు తేలింది. ఆప్షన్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవడంతో రెండో విడత కౌన్సెలింగ్‌లోనే మిగిలిన కాలేజీలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలపకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన తగ్గడంలేదు. తెలంగాణలోని ఆరు ప్రభుత్వ కాలేజీల సీట్లకు కౌన్సెలింగ్ జరిగే అవకాశం ఉందని రాష్ట్ర వైద్య విద్య ఉన్నతాధికారులు చెబుతున్నారు.
జూలై 6 నుంచి రెండో విడత కౌన్సెలింగ్...
తెలంగాణలోని ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలతోపాటు ఒక ఈఎస్‌ఐ కాలేజీలో కలిపి మొత్తం 1,250 సీట్లు ఉండగా నేషనల్ పూల్ నిబంధనల ప్రకారం ఈ కాలేజీల్లోని 15 శాతం (187) సీట్లు ఈ కేటగిరీలో ఉంటాయి. అలాగే దేశవ్యాప్తంగా దాదాపు 5 వేల సీట్లకు మన రాష్ట్ర విద్యార్థులు పోటీ పడే అవకాశం ఉంటుంది. నేషనల్ పూల్ సీట్ల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. నేషనల్ పూల్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ మొదలైంది. ఆప్షన్ల నమోదుకు సోమవారం వరకు అవకాశం ఉంది. ఈ నెల 22న సీట్ల కేటాయింపు జాబితాను వెల్లడిస్తారు. జూలై 3 వరకు కాలేజీలలో ప్రవేశాల ప్రక్రియ ఉంటుంది. అనంతరం జూలై 6 నుంచి 8 వరకు జాతీయ కోటా రెండో విడత ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment