మరో 5 వైద్య కళాశాలల ప్రారంభానికి కసరత్తు | Govt will start 5 more medical colleges | Sakshi
Sakshi News home page

మరో 5 వైద్య కళాశాలల ప్రారంభానికి కసరత్తు

Published Thu, Aug 31 2023 4:47 AM | Last Updated on Thu, Aug 31 2023 3:59 PM

Govt will start 5 more medical colleges - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్య, వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వచ్చే విద్యా సంవత్సరం (2024–25)లో మరో 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభానికి సిద్ధమవుతోంది. వీటిలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి నిర్ణయించింది. ఈమేరకు కొత్త పోస్టులను కూడా మంజూరు చేసింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా ప్రభుత్వం రూ.8480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ కళాశాలల ఏర్పాటు వేగంగా జరుగుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభిస్తున్నారు. ఆ కళాశాలల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె కళాశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది.

3530 పోస్టుల సృష్టి
ఈ ఐదు కళాశాలలు ప్రారంభించడానికి వీలుగా నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా కొత్త పోస్టులను ప్రభుత్వం ఇప్పటికే సృష్టించింది. ఒక్కో వైద్య కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 3,530 పోస్టులను మంజూరు చేసింది.

అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్, ఎస్పీఎం, జనరల్‌ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్స్‌ ఇలా వివిధ విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో పాటు, నర్సింగ్, మెడికల్, నాన్‌మెడికల్, అడ్మినిస్ట్రేషన్‌ పోస్టులను మంజూరు చేసింది.

వైద్య పోస్టుల భర్తీకి ఇప్పటికే మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడుతోంది. ఈ ఐదు చోట్ల ఏపీవీవీపీ ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేస్తున్నారు. 

సమకూరనున్న మరో 750 ఎంబీబీఎస్‌ సీట్లు
17 కొత్త వైద్య కళాశాలల ద్వారా ఏకంగా 2550 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి. వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఈ విద్యా సంవత్సరంలో  ఐదు కళాశాలలు ప్రారంభించడం ద్వారా 750 ఎంబీబీఎస్‌ సీట్లు వచ్చాయి. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే 5 కాలేజీల్లో ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు వస్తాయి. మిగిలిన ఏడు కళాశాలలను 2025–26లో ప్రారంభించేలా ప్రణాళిక రచించారు.

వేగంగా నిర్మాణాలు
ఐదు చోట్ల వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల నిర్మాణం వేగంగా సాగుతోంది. 2024–25 సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలల అనుమతులకు ఎన్‌ఎంసీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రభుత్వం ఇప్పటికే పోస్టులు మంజూరు చేసింది. ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్ల నియామకం జరిగింది.

ఇతర వైద్యులు, సిబ్బంది నియామకాలు వేగంగా పూర్తి చేసి ఐదు కళాశాలలు ప్రారంభించడానికి ఎల్‌వోపీ కోసం ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేస్తాం. 2023–24 విద్యా సంవత్సరానికి 5 కళాశాలలకు అనుమతులు తెచ్చిన అనుభవం ఈ సారి సులువుగా పనులు పూర్తి చేయడానికి దోహద పడుతుంది.  – ఎం.టి. కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement