రెండో దశ వైద్య కళాశాలల ప్రారంభాన్ని పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
ఎన్‌ఎంసీ అనుమతులు రాబట్టేలా కావాలనే చర్యలు తీసుకోని వైనం
2024–25 విద్యా సంవత్సరంలోనే పలు చర్యలు తీసుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం
దాదాపు 250 వైద్య, వందల సంఖ్యలో సిబ్బంది పోస్టులు భర్తీ
ఇప్పుడు స్వల్ప స్థాయిలో వైద్యులు, చిన్న చిన్న మౌలిక వసతులు కల్పిస్తే చాలు
అయినా ఉద్దేశ పూర్వకంగా, నిర్లక్ష్యంతో పట్టించుకోని కూటమి సర్కారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభంపై చంద్రబాబు ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను పెంచడంతో పాటు, నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేసే లక్ష్యంతో ఏకంగా రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటిలో ఐదు వైద్య కళాశాలలను గత ఏడాది ప్రారంభించగా, మరో ఐదు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంది.
ఈ క్రమంలో ఈ ఏడాది మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, ఆదోని, పాడేరు కళాశాలల్లో ఒక్కో చోట 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ కళాశాలలను ప్రారంభిస్తే వైఎస్ జగన్‌కు క్రెడిట్ దక్కుతుందని కూటమి ప్రభుత్వం.. అనుమతులు రాబట్టడంలో చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవడం లేదు.
మొక్కుబడిగా అప్పీల్
వైద్య కళాశాలలు ప్రారంభించడం కోసం ఐదు చోట్ల సెకండరీ కేర్ ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడంతో పాటు, నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా పోస్టులను గత ప్రభుత్వంలోనే మంజూరు చేశారు. మెజార్టీ శాతం పోస్టుల భర్తీ చేపట్టారు. మిగిలిన పోస్టులు కూడా భర్తీ చేసే క్రమంలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మరోవైపు మొదటి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థుల అకడమిక్ కార్యకలాపాల కోసం లెక్చర్ హాల్, ల్యాబ్, వసతి కోసం హాస్టల్స్, క్యాంటిన్ ఇలా వివిధ నిర్మాణాలు చేపట్టింది.
ఎన్నికల ఫలితాలు వెలువడే నాటికి 80 శాతం మేర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జూన్ 24న ఎన్‌ఎంసీ బృందాలు ఈ ఐదు కళాశాలల్లో తనిఖీలు నిర్వహించాయి. మదనపల్లెలో 12 శాతం, పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోనీల్లో స్వల్ప స్థాయిలో ఫ్యాకల్టీ కొరత ఉందని, కళాశాలల్లో కొన్ని వసతులను మెరుగుపరుచుకోవాలని అనుమతులను నిరాకరిస్తూ జూలై 6న కళాశాలలకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో మిగిలిన కొద్ది పోస్టులను భర్తీ చేయడంతో పాటు, కళాశాలలు, హాస్టల్స్‌లో ఫర్నీచర్ సమకూర్చడంతో పాటు, తుది దశ పనులను పూర్తి చేస్తే రెండో దశ తనిఖీల్లో వంద శాతం సీట్లకు అనుమతులు వస్తాయి.
అప్పీల్‌కు వెళ్లడానికి చివరి వరకూ నాన్చి.. నాన్చి.. గడువు ముగిసే ముందు రోజు వైద్య శాఖకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇదిలా ఉంటే ఎన్‌ఎంసీ రెండో విడత తనిఖీలు నిర్వహించే నాటికి వసతులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన కల్పించాల్సి ఉండగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో బుధవారం పులివెందుల కళాశాలలో వర్చువల్‌గా ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. తొలి దశ తనిఖీలప్పుడు ఉన్న పరిస్థితులే ఇప్పుడూ ఉన్నాయని గుర్తించినట్టు సమాచారం.
ఉద్దేశ పూర్వకం.. ఇదే నిదర్శనం
» ఈ ఐదు వైద్య కళాశాలల కోసం గత వైఎస్ జగన్ ప్రభుత్వం 250కి పైగా వైద్యుల పోస్టులు, దాదాపు సరిపడా సంఖ్యలో సిబ్బంది పోస్టులను భర్తీ చేసింది. ఇంకా ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా మరో 380 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చింది. ఇంతలో చంద్రబాబు ప్రభుత్వం రావడంతో వీటిని భర్తీ చేయాలని తొలి సమీక్షలోనే వైద్య శాఖ సీఎం దృష్టికి తీసుకెళ్లినా అనుమతులు ఇవ్వలేదు.
» పలు స్పెషాలిటీల్లో ఎన్నిసార్లు నోటిఫికేషన్‌లు ఇచ్చినా వైద్యులు రావడం లేదని గిరిజన ప్రాంతాల్లో 50 శాతం, గ్రామీణ ప్రాంతంలో 30 శాతం అదనపు ప్రోత్సహం ఇవ్వడంతో పాటు, కాంట్రాక్ట్ విధానంలో ప్రొఫెసర్, అసోసియేట్‌లను తీసుకోవాలని గతంలోనే నిర్ణయించారు. వీటిని కొనసాగించకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంది. కాగా కొన్ని స్పెషాలిటీలలో దేశ వ్యాప్తంగా వైద్యుల కొరత ఉన్నప్పటికీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చొరవ వల్ల ఎన్‌ఎంసీ అనుమతులు వస్తున్నాయి.
» 313 స్టాఫ్ నర్సుల పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసి జాబితా ప్రకటించి, వారికి పోస్టింగ్‌లు ఇచ్చే సమయంలో టీడీపీ ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారని ఉత్తర్వులు ఇవ్వకుండా నిలిపి వేశారు. స్టాఫ్ నర్సులు లేక ఆయా బోధనాస్పత్రుల్లో వైద్య సేవలపై ప్రభావం పడుతున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఉంటే
పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో చిత్తశుద్ధితో అడుగులు వేశారు. గత ఏడాది విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల కళాశాలల్లో తొలి విడత తనిఖీల్లో ఒక్క విజయనగరానికి మాత్రమే అనుమతులు లభించాయి. రెండో విడత తనిఖీల్లో అనుమతులు రాబట్టడం కోసం చిత్తశుద్ధితో అప్పట్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుత ప్రభుత్వానికి కూడా పేదల ఆరోగ్యం, విద్యార్థుల ఆకాంక్షల పట్ల చిత్తశుద్ధి ఉండి ఉంటే అదే తరహాలో చర్యలు తీసుకుని ఉండేదని వైద్య వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఐదు వైద్య కళాశాలలకు అనుమతులు రావడం కష్టమేననే భావన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment