
న్యూఢిల్లీ: గత రెండు బడ్జెట్‌లతో పోల్చితే ఈసారి ఆరోగ్య రంగానికి కేంద్రం నిధులు గణనీయంగా పెంచింది. వైద్య విద్యను బలోపేతం చేసే దిశగా మెడికల్ కాలేజీలను నవీకరించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిధులు కేటాయించారు. ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో రూ. 62,659.12 కోట్లు ప్రతిపాదించారు. 2018–19 బడ్జెట్ (రూ. 52,800 కోట్లు)తో పోల్చితే 19 శాతం పెంచారు. కేంద్రం కీలకంగా భావిస్తున్న బీమా పథకమైన ఆయుష్‌మాన్ భారత్–ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎంజేఏవై)కు రూ. 6,400 కోట్లు కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లో ఆయుష్‌మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్స్ నెలకొల్పడానికి రూ. 249.96 కోట్లను కేటాయించారు. ఇక జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ఆ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రూ. 1,349.97 కోట్లు ప్రతిపాదించారు. జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ. 32,995 కోట్లు కేటాయించారు. అయితే ఎన్‌హెచ్‌ఎం కార్యక్రమమైన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్‌ఎస్‌బీవై) పథకానికి భారీగా కోత పెట్టారు.
ఈసారి కేవలం రూ. 156 కోట్లు మాత్రమే కేటాయించారు. జాతీయ ఎయిడ్స్, ఎస్‌టీడీ నియంత్రణ కార్యక్రమానికి గతేడాది కంటే రూ. 400 కోట్లు పెంచి రూ. 2,500 కోట్లు కేటాయించారు. ఇక ఎయిమ్స్‌కు గత బడ్జెట్‌లో రూ. 3,018 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ. 3,599.65 కోట్లకు పెంచారు. జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమానికి రూ. 40 కోట్లు, కేన్సర్, డయాబెటిస్, గుండె జబ్బుల నియంత్రణ కార్యక్రమానికి రూ. 175 కోట్లు కేటాయించారు. కార్పొరేట్ ఆస్పత్రులు, పెద్ద ఆస్పత్రుల్లో వైద్యానికి సంబంధించిన టెర్షియరీ కేర్ పోగ్రామ్‌లో రూ. 200 కోట్లు కోత పెట్టి రూ. 550 కోట్లు ప్రతిపాదించారు. నర్సింగ్ సర్వీసులకు రూ. 64 కోట్లు, ఫార్మసీ స్కూళ్లు, కాలేజీకు రూ. 5 కోట్లు, జిల్లా ఆస్పత్రులు, రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీలు (పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్) అప్‌గ్రేడ్ చేయడానికి రూ. 800 కోట్లు, జిల్లా ఆస్పత్రులను కొత్త మెడికల్ కాలేజీలుగా మార్చడానికి రూ. 2,000 కోట్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను (అండర్ గ్రాడ్యుయేట్), కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థలను బలోపేతం చేయడానికి రూ. 1,361 కోట్లు ప్రతిపాదించారు.
సంప్రదాయ వైద్యానికి రూ. 1,939.76 కోట్లు
సంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించే దిశగా మోదీ ప్రభుత్వం ఆయుష్ మంత్రిత్వ శాఖకు సుమారు 15 శాతం అధికంగా నిధులిచ్చింది. ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి (ఆయుష్) వైద్యానికి సంబంధించి రూ. 1,939.76 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. ఆయుష్ నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రూ. 92.31 కోట్లు ప్రతిపాదించారు. ఇక అటానమస్ సంస్థలైన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ వైద్యానికి సంబంధించి వరుసగా.. రూ. 292.31 కోట్లు, రూ. 118.53 కోట్లు, రూ. 152.65 కోట్లు కేటాయించారు.
ఈ బడ్జెట్‌లో ఆరోగ్య రంగం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేయాలంటే రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో రూ.100 లక్షల కోట్లను కేంద్రం వెచ్చించాల్సి ఉంటుంది. విదేశీ బీమా మధ్యవర్తిత్వ సంస్థల్లో 100 శాతం ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) వల్ల భారత ఆరోగ్య రంగానికి పరోక్షంగా లబ్ధిచేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రగతిశీల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
- గౌతమ్ ఖన్నా సీఈవో హిందుజా ఆసుపత్రి–ఎంఆర్‌సీ
Comments
Please login to add a commentAdd a comment