సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగం బలోపేతానికి రూ.64 వేల కోట్లతో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ వారణాశిలో ప్రారంభించారు. భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను ఎదుర్కోవడానికి, ఆరోగ్య రంగంలో స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా ఈ పథకం తీసుకొచ్చారు.
నాలుగేళ్లలో గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టనుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది వైద్య కళాశాలలను కూడా ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్ధ నగర్, వారణాశిలలోలు పర్యటించిన ప్రధాని మోదీ ఆరోగ్య రంగంపై కేంద్రం తీసుకోబోతున్న చర్యలు వివరించారు. ‘‘ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెంచడం అనేది దశాబ్దాల క్రితమే జరిగి ఉండాల్సింది’’ అని వారణాశిలో మోదీ వ్యాఖ్యానించారు.
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ఆరోగ్య రంగంలో ఉన్న అంతరాలను తగ్గిస్తుందని అన్నారు. ‘‘మా కన్నా ముందు అధికారంలో ఉన్న వారు ఆరోగ్య సేవలను డబ్బు సంపాదనకు, కుంభకోణాలకు ఓ సాధనంగా వినియోగించుకున్నారు. గతంలో ప్రజల సొమ్ము కుంభకోణాల్లోకి వెళ్లేది... ఇప్పుడా సొమ్ము పెద్ద ప్రాజెక్టులకు వినియోగపడుతోంది. ఎన్డీయే ప్రభుత్వం వైద్య, ఆరోగ్య సదుపాయాలపై దూకుడు విధానం అవలంభిస్తాం’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం ప్రభుత్వంలో ఉండి కూడా వారు వైద్య రంగం సర్వతోముఖాభివృద్ధికి పాటుపడలేదని మోదీ విమర్శించారు. గ్రామాల్లో సరిపడా ఆసుపత్రులు లేవు, ఒక వేళ ఆసుపత్రులు ఉంటే వాటిలో వైద్యులు ఉండేవారు కాదన్నారు.
ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల సదుపాయాలు లేవని... ఆయా సమస్యలన్నింటినీ ఈ మిషన్ పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. ఈ మిషన్ దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, మహమ్మారులను ఎదుర్కోవడానికి ఉపకరిస్తుందని, ఆరోగ్య రంగానికి మరింత ఆత్మవిశ్వాసం అందిస్తుందన్నారు. ఆరోగ్య రంగం బలోపేతం వల్ల ఉపాధి అవకాశాలు మరింత మెరుగవతాయన్నారు. సదుపాయాలన్నీ ఉన్న ఓ ఆసుపత్రి ఏర్పాటు వల్ల సమీప పట్టణంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయన్నారు. ఈ సందర్భంగా వారణాశిలో రూ.5,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ద్వారా పది కీలక రాష్ట్రాల్లోని 17,788 గ్రామీణ ఆరోగ్య, వెల్‌నెస్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచనున్నారు. దీంతోపాటు 11,024 అర్బన్ హెల్త్, వెల్‌నెస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు..
Comments
Please login to add a commentAdd a comment