హెల్త్‌కు వెల్త్‌ | Budget 2020 provides additional Rs 69000 crore for health sector | Sakshi
Sakshi News home page

హెల్త్‌కు వెల్త్‌

Published Sun, Feb 2 2020 4:47 AM | Last Updated on Sun, Feb 2 2020 4:47 AM

Budget 2020 provides additional Rs 69000 crore for health sector - Sakshi

న్యూఢిల్లీ: ‘‘ఆరోగ్య రంగానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. పౌరుల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగుతున్నాం’’ అని బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆరోగ్య రంగాన్ని మరింత మెరుగుపరచడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల ఆధునీకరణపై దృష్టి సారించారు. ఇందుకోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఆసుపత్రుల సంఖ్యను పెంచనున్నారు. ఆరోగ్యం అంటే వ్యాధులు సోకితే ఆస్పత్రుల్లో చికిత్స చేయడమే కాదు, ప్రజలు రోగాల బారిన పడకుండా పూర్తి ఫిట్‌గా ఉండేలా చూడడం కూడా. ఇందుకోసం ఈ సారి ప్రజారోగ్యమే అంతిమ లక్ష్యంగా కేంద్రం కొనసాగిస్తున్న ఎన్నో పథకాలను విస్తరించాల్సిన అవసరం గురించి సీతారామన్‌ వివరించారు. గత బడ్జెట్‌తో  పోల్చి చూస్తే  ఆరోగ్య రంగ నిధుల్ని 8శాతం పెంచారు.

ఆయుష్మాన్‌ భారత్‌ విస్తరణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలల పథకం ఆయుష్మాన్‌ భారత్‌–ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎంజేఏవై) విస్తరించడానికి  కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేటు (పీపీపీ) భాగస్వామ్యంతో  ఆయుష్మాన్‌ భారత్‌  పథకం కింద మరిన్ని ఆస్పత్రులను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు.  ఈ ఆస్పత్రుల ఏర్పాటు ప్రైవేటు వ్యక్తులకి లాభదాయం కాకపోతే వయబిలిటీ గ్యాప్‌ కింద ప్రభుత్వమే నిధుల్ని సమకూరుస్తుంది. దీని కోసం దేశవ్యాప్తంగా 112 జిల్లాలను ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి వచ్చే ఆస్పత్రులు లేని చోట కొత్త ఆస్పత్రుల్ని ఏర్పాటు చేస్తారు.

తద్వారా యువతకు ఎన్నో కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని మంత్రి చెప్పారు. ఆయుష్మాన్‌ భారత్‌కి గత బడ్జెట్‌లో రూ.6,400 కోట్లు కేటాయిస్తే, ఈ సారీ అంతే మొత్తాన్ని కేటాయించారు. 2018లో ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. భారత్‌ జనాభాలో దాదాపుగా 40శాతం మందికి లబ్ధి చేకూరేలా, నిరుపేద కుటుంబాలకు  ఏడాదికి రూ.5 లక్షల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ ఇవ్వడమే ఈ పథకం లక్ష్యం. 10.74 కోట్ల కుటుంబాలకు చెందిన దాదాపుగా 50 కోట్ల మంది ఈ పథకం లబ్ధి దారులుగా ఉన్నారు.  ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2019, నవంబర్‌ 25 నాటికి ఆయుష్మాన్‌ భారత్‌ కింద  11.4 కోట్ల మందికి ఇ–కార్డుల్ని జారీ చేశారు.

ప్రతీ జిల్లాలో ఓ మెడికల్‌ కాలేజ్‌
దేశంలోని ప్రతీ జిల్లాలోనూ ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని పార్లమెంటులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఉందని, దీన్ని అధిగమించడానికి ప్రైవేటు–ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రతీ జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రికి మెడికల్‌ కాలేజీని అనుంబంధంగా ఏర్పాటు చేస్తామన్నారు. భూమి, మౌలిక సదుపాయాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే రాష్ట్రాల్లో వీటికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. రోగులు– వైద్యుల నిష్పత్తిలో వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ పథకం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. సరిపడినంత స్థాయిలో రెసిడెంట్‌ డాక్టర్స్‌ డిప్లొమా/ ఫెలో బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ కోర్సులను ఆఫర్‌ చేసే  ఆసుపత్రులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.

ముఖ్యాంశాలు..
► మిషన్‌ ఇంద్ర ధనుష్‌  (ప్రభుత్వ వాక్సినేషన్‌ కార్యక్రమం) కింద అయిదు వైరస్‌లు సహా 12 కొత్త తరహా వ్యాధుల్ని తీసుకువచ్చారు.

► ప్రజల జీవన విధానంలో వచ్చే మార్పుల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల నివారణ కోసం ఫిట్‌ ఇండియా ఉద్యమం,  అందరికీ సురక్షిత మంచినీరు అందించడం కోసం జలజీవన్‌ మిషన్‌ , దేశంలో పారిశుద్ధ్య వ్యవస్థని మెరుగుపరిచి పరిశుభ్రంగా ఉండడం కోసం స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ద్వారా నిరుపేదలకు వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు.

► ఆయుష్మాన్‌ భారత్‌ కిందకి వచ్చే ఆసుపత్రుల సంఖ్యను  టైర్‌ 2, టైర్‌ 3 నగరాల్లో పెంచాలని నిర్ణయం. ప్రస్తుతం ఈ పథకం కింద 20 వేలకుపైగా  ఆసుపత్రులు ఉన్నాయి. మరో వెయ్యి ఆస్పత్రులు పెంచడానికి చర్యలు

► ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో జిల్లా స్థాయిలో మెడికల్‌ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచడం.

► ప్రజలకు అందుబాటు ధరల్లో మందులు దొరికేలా అన్ని జిల్లాల్లో  జన్‌ ఔషధి కేంద్రాల ఏర్పాటు. జనరిక్‌ మెడిసిన్స్‌ని విక్రయించే  ఈ దుకాణాలను నాలుగేళ్లలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు.

 

► వైద్య పరికరాల దిగుమతులు, విక్రయం ద్వారా వచ్చే  పన్నుల్ని ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగం. కొన్ని నిర్దిష్ట వైద్య పరికరాల దిగుమతులపై 5శాతం ఆరోగ్య సెస్‌ విధింపు . ప్రస్తుతం  భారత వైద్య పరికరాల రంగం 80 నుంచి 90 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడింది. ఈ నిర్ణయంతో రెండు రకాలుగా ప్రయోజనాలున్నాయని అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడికల్‌ డివైస్‌ ఇండస్ట్రీకి చెందిన సమన్వయకర్త రాజీవ్‌ నాథ్‌ అన్నారు. వైద్య పరికరాల రంగం మేకిన్‌ ఇండియాకు ఊతమిస్తుందని, మౌలిక సదుపాయాలకు ఈ నిధుల్ని వినియోగించడం వల్ల జాతీయ ఆరోగ్య రంగ భద్రతపై నెలకొన్న ఆందోళనలు తొలగిపోయే అవకాశాలున్నాయని అన్నారు.

► ఆరోగ్య రంగ అధికారులు మిషన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వ్యాధులపై పోరాటం చేయాలి.

► క్షయ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది అన్న నినాదంతో ట్యూబర్‌ కొలాసిస్‌ (టీబీ)పై పోరుబాట. 2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం అడుగులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement