సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ఇంటర్‌కు బదులు నాలుగేళ్ల ప్రీమెడికల్ కోర్సు ఉంటుంది. అది పూర్తి చేసిన వారికి వచ్చే మార్కులు, ర్యాంకుల ఆధారంగా ఎంబీబీఎస్, డెంటల్, ఫిజియోథెరపీ, నర్సింగ్ వంటి కోర్సులకు వెళ్తారు. దాదాపు అలాంటి ఎంబీబీఎస్ కోర్సును రూపొందించే పనిలో కేంద్రం నిమగ్నమైంది. ఆ మేరకు ఎంబీబీఎస్ కోర్సులో సమూల మార్పులు చేసేందుకు జాతీయ విద్యా విధానం–2019 ముసాయిదా రంగం సిద్ధం చేసింది. వైద్య విద్యకు వెళ్లాలనుకునే వారికి ప్రాథమిక కోర్సు ప్రారంభించి అనంతరం వారి నైపుణ్యం ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్ కోర్సుల్లో చేరేలా అవకాశం కల్పిస్తారు. నర్సింగ్, డెంటల్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన వారు ఎంబీబీఎస్ కోర్సులో తర్వాత చేరేలా (లేటరల్ ఎంట్రీ) మరో ప్రతిపాదన సిద్ధం చేశారు. డెంటల్ కోర్సులో ఉండగా మధ్యలో ఎంబీబీఎస్‌లో చేరాలనుకుంటే ప్రత్యేక పరీక్ష ద్వారా అవకాశం కల్పించాలన్నది మరో అవకాశం. అందుకు సైన్స్ విద్యార్థులందరికీ ఏడాది లేదా రెండేళ్లు కామన్ కోర్సు ఉండాలని.. తర్వాత డెంటిస్ట్, నర్సింగ్, మెడిసిన్ స్పెషలైజేషన్ పెట్టాలని సూచించింది. లేటరల్ ఎంట్రీకి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటుందని, వారు ‘నీట్’రాయాల్సిందేనని జాతీయ విద్యా విధానంలోని వైద్య విద్య ముసాయిదాలో పేర్కొన్నట్లు రాష్ట్రానికి చెందిన వైద్య నిపుణులు చెబుతున్నారు.
గ్రామీణులకు వైద్య విద్య..
మెడిసిన్, నర్సింగ్, డెంటల్‌కు చెందిన పలు కౌన్సిళ్లను వాటికి సంబంధించిన ప్రమాణాలు చూడటం, కాలేజీల్లో తనిఖీలు చేయడం, అక్రెడిటేషన్లు ఇవ్వడం వరకే పరిమితం చేయాలని విద్యా విధానం ముసాయిదా సూచించింది. ఫీజుల వ్యవస్థలోనూ మార్పులు తేవాలని, వాటి నిర్ణయాధికారం సంస్థలకే ఇవ్వాలని పేర్కొంది. అయితే 50 శాతం మందికి స్కాలర్‌షిప్‌లు ఇవ్వడంతో పాటు, 20 శాతం మందికి పూర్తి స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని పేర్కొంది. విద్యకయ్యే ఖర్చును తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు వైద్య విద్య అందేలా చూడాలని చెప్పింది. ఎంబీబీఎస్ విద్యార్థులకు కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ కూడా ఉండాలని పేర్కొంది. ఆ ఎగ్జిట్ ఎగ్జామ్ మెడికల్ పీజీకి ప్రవేశంగా ఉండాలని వివరించింది. అంటే మెడికల్ పీజీకి ఇక నీట్ పరీక్ష ఉండదన్నమాట.
వాటిని బోధనాసుపత్రులుగా చేయాలి..
ఆరోగ్య రంగంలో వృత్తి నిపుణులు తక్కువగా ఉన్నారని, దీన్ని అధిగమించడానికి సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక కమిటీ నియమించాలని ముసాయిదా సూచించింది. ఆరోగ్య రంగంలో ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు దేశంలోని 600 జిల్లా ఆసుపత్రులను బోధనాసుపత్రులుగా ఆధునీకరించాలని పేర్కొంది. మెడికల్ పీజీ సీట్లను కూడా పెంచాలని సూచించింది. మెడికల్ ప్రాక్టీస్‌ను ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ నుంచి వేరు చేయాలని పేర్కొంది. అయితే కేంద్ర ముసాయిదాపై దంత, నర్సింగ్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తుండగా, ఉన్న మెడికల్ విద్యా వ్యవస్థను అనవసరంగా నాశనం చేస్తున్నారని సీనియర్ వైద్యులు పెదవి విరుస్తున్నారు. అయితే వైద్య విద్యలో ఆచరణాత్మకమైన పద్ధతులను కేంద్ర విద్యా విధానం తీసుకురావట్లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
బీడీఎస్‌లూ ఎంబీబీఎస్ చేయొచ్చు..
Published Sat, Jun 8 2019 1:31 AM | Last Updated on Sat, Jun 8 2019 1:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment