dental clinic
-
ప్రసవ వేదన.. 7 కిలోమీటర్లు నడిచి చివరికి..
సాక్షి, బెంగళూరు : లాక్డౌన్ గర్భిణీలకు శాపంగా మారింది. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండడంతో ఇంటి నుంచి కాలు బయటపెట్టలేని దుస్థితి ఏర్పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ఓ నిండు గర్భిణీ పురుటి నొప్పులతో బాధపడుతూ.. దాదాపు 7 కిలోమీటర్లు ప్రయాణించి చివరకు ఓ డెంటల్ ఆస్పత్రిలో ప్రసవించింది. చుట్టు పక్కల ఆస్పత్రులు తెరిచి ఉండక పోవడంతో డెంటల్ డాక్టర్లే ఆమెకు పురుడు పోశారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. (చదవండి : పెళ్లి కోసం 800 కిలోమీటర్ల ప్రయాణం.. చివరికి) నార్త్ బెంగళూరుకు చెందిన ఒక కార్మికుడు నెలలు నిండిన తన భార్యకు నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దాదాపు 7 కిలోమీటర్లు ప్రయాణం చేసినా ఒక్క ఆస్పత్రి కూడా తెరచి లేదు. నొప్పులు ఎక్కువ కావడంతో చివరకు ఒక డెంటల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అక్కడి డాక్టర్లు ఆమెకు డెలివరీ చేశారు. పుట్టిన శిశువులో చలనం లేకపోవడంతో చనిపోయిందని భావించిన వైద్యులు.. తీవ్ర రక్తస్త్రావం అవుతున్న తల్లిని బతికించేందుకు చికిత్స అందించారు. అయితే అదృష్టవశాత్తు శిశువులో కదలికలు వచ్చాయి. దీంతో తల్లి, బిడ్డలను బెంగళూరులోని ఆస్పత్రికి తరలించారు. లాక్డౌన్ కారణంగా అన్ని ఆస్పత్రులు మూసి ఉన్నాయని, గర్భిణీ నొప్పుల బాధను చూడలేక తప్పనిసరి పరిస్థతుల్లో ప్రసవం చేశామని డెంటల్ డాక్టర్ రమ్య అన్నారు. ఇప్పుడు వాళ్లిద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. -
బీడీఎస్‌లూ ఎంబీబీఎస్ చేయొచ్చు..
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ఇంటర్‌కు బదులు నాలుగేళ్ల ప్రీమెడికల్ కోర్సు ఉంటుంది. అది పూర్తి చేసిన వారికి వచ్చే మార్కులు, ర్యాంకుల ఆధారంగా ఎంబీబీఎస్, డెంటల్, ఫిజియోథెరపీ, నర్సింగ్ వంటి కోర్సులకు వెళ్తారు. దాదాపు అలాంటి ఎంబీబీఎస్ కోర్సును రూపొందించే పనిలో కేంద్రం నిమగ్నమైంది. ఆ మేరకు ఎంబీబీఎస్ కోర్సులో సమూల మార్పులు చేసేందుకు జాతీయ విద్యా విధానం–2019 ముసాయిదా రంగం సిద్ధం చేసింది. వైద్య విద్యకు వెళ్లాలనుకునే వారికి ప్రాథమిక కోర్సు ప్రారంభించి అనంతరం వారి నైపుణ్యం ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్ కోర్సుల్లో చేరేలా అవకాశం కల్పిస్తారు. నర్సింగ్, డెంటల్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన వారు ఎంబీబీఎస్ కోర్సులో తర్వాత చేరేలా (లేటరల్ ఎంట్రీ) మరో ప్రతిపాదన సిద్ధం చేశారు. డెంటల్ కోర్సులో ఉండగా మధ్యలో ఎంబీబీఎస్‌లో చేరాలనుకుంటే ప్రత్యేక పరీక్ష ద్వారా అవకాశం కల్పించాలన్నది మరో అవకాశం. అందుకు సైన్స్ విద్యార్థులందరికీ ఏడాది లేదా రెండేళ్లు కామన్ కోర్సు ఉండాలని.. తర్వాత డెంటిస్ట్, నర్సింగ్, మెడిసిన్ స్పెషలైజేషన్ పెట్టాలని సూచించింది. లేటరల్ ఎంట్రీకి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటుందని, వారు ‘నీట్’రాయాల్సిందేనని జాతీయ విద్యా విధానంలోని వైద్య విద్య ముసాయిదాలో పేర్కొన్నట్లు రాష్ట్రానికి చెందిన వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్రామీణులకు వైద్య విద్య.. మెడిసిన్, నర్సింగ్, డెంటల్కు చెందిన పలు కౌన్సిళ్లను వాటికి సంబంధించిన ప్రమాణాలు చూడటం, కాలేజీల్లో తనిఖీలు చేయడం, అక్రెడిటేషన్లు ఇవ్వడం వరకే పరిమితం చేయాలని విద్యా విధానం ముసాయిదా సూచించింది. ఫీజుల వ్యవస్థలోనూ మార్పులు తేవాలని, వాటి నిర్ణయాధికారం సంస్థలకే ఇవ్వాలని పేర్కొంది. అయితే 50 శాతం మందికి స్కాలర్షిప్లు ఇవ్వడంతో పాటు, 20 శాతం మందికి పూర్తి స్కాలర్షిప్లు ఇవ్వాలని పేర్కొంది. విద్యకయ్యే ఖర్చును తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు వైద్య విద్య అందేలా చూడాలని చెప్పింది. ఎంబీబీఎస్ విద్యార్థులకు కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ కూడా ఉండాలని పేర్కొంది. ఆ ఎగ్జిట్ ఎగ్జామ్ మెడికల్ పీజీకి ప్రవేశంగా ఉండాలని వివరించింది. అంటే మెడికల్ పీజీకి ఇక నీట్ పరీక్ష ఉండదన్నమాట. వాటిని బోధనాసుపత్రులుగా చేయాలి.. ఆరోగ్య రంగంలో వృత్తి నిపుణులు తక్కువగా ఉన్నారని, దీన్ని అధిగమించడానికి సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక కమిటీ నియమించాలని ముసాయిదా సూచించింది. ఆరోగ్య రంగంలో ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు దేశంలోని 600 జిల్లా ఆసుపత్రులను బోధనాసుపత్రులుగా ఆధునీకరించాలని పేర్కొంది. మెడికల్ పీజీ సీట్లను కూడా పెంచాలని సూచించింది. మెడికల్ ప్రాక్టీస్‌ను ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ నుంచి వేరు చేయాలని పేర్కొంది. అయితే కేంద్ర ముసాయిదాపై దంత, నర్సింగ్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తుండగా, ఉన్న మెడికల్ విద్యా వ్యవస్థను అనవసరంగా నాశనం చేస్తున్నారని సీనియర్ వైద్యులు పెదవి విరుస్తున్నారు. అయితే వైద్య విద్యలో ఆచరణాత్మకమైన పద్ధతులను కేంద్ర విద్యా విధానం తీసుకురావట్లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఆరుషి కోసం అరుదైన పని
సాక్షి, న్యూఢిల్లీ : ఆరుషి మృతి కేసులో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. దస్న జైలులోని దంతవైద్య విభాగానికి ఆరుషి పేరు పెట్టాలని నిర్ణయించింది. తల్వార్ దంపతుల కోరిక మేరకు ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు సమాచారం. నాలుగేళ్ల శిక్షా కాలంలో అధికారులకు విన్నవించి తల్వార్ దంపతులు దంత వైద్య విభాగం నెలకొల్పి... తమ సేవలను అందించారు. అందుకుగానూ రూపాయి ప్రతిఫలం కూడా వారు తీసుకోలేదు. ఈ క్రమంలో జైలు ఆస్పత్రిలోని దంత వైద్యశాలకు తమ కూతురి పేరు పెట్టాలంటూ విడుదల సమయంలో తల్వార్ దంపతులు యూపీ జైళ్ల శాఖ మంత్రి జై కుమార్ సింగ్ జాకీకి విన్నవించుకున్నారు. వారి విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని వైద్యశాలకు ఆరుషి పేరు పెట్టేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. మరో పదిహేను రోజుల్లో జైలు అధికారులుగానీ, లేదా తానే స్వయంగా కలిసి సంబంధిత పత్రాలపై తల్వార్ తల్లిదండ్రుల నుంచి సంతకాలు తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు. వారంలో రెండు రోజులపాటు తల్వార్ దంపతులు దస్న జైలును సందర్శించి సేవలు అందిస్తారని జై కుమార్ చెప్పారు. గత వారం అలహాబాద్ హైకోర్టు ఆరుషి హత్య కేసులో సరైన సాక్ష్యాలు లేవని రాజేశ్, నుపుర్ తల్వార్లను విడుదలకు ఆదేశించగా.. తమ కూతురి మృతి వెనుక దాగున్న రహస్యాలు బయటపడేదాకా న్యాయ పోరాటం చేస్తామని వాళ్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
డెంటల్ క్లినిక్‌లో మహిళ అనుమానాస్పద మృతి
తిరుపతి: తిరుపతిలోని దొడ్డాపురంలో మాన్య డెంటల్ క్లినిక్‌లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. మృతురాలిని డెంటల్ క్లినిక్‌లో పనిచేసే సంధ్యగా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. డాక్టర్‌ను ఆస్పత్రి సిబ్బందిని విచారిస్తున్నారు. ఈ కేసులో సంధ్య ప్రియుడికి సంబంధముందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అతనికి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
కీచక డాక్టర్..!
తాండూరు రూరల్, న్యూస్‌లైన్: వైద్యో.. నారాయణ హరి! అన్నారు పెద్దలు.. కాని ఓ డాక్టర్ సభ్య సమాజం తలదించుకునే విధంగా చేశాడు. పంటివైద్యం కోసం ఆశ్రయించిన ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించి వైద్యలోకానికి మాయని మచ్చతెచ్చాడు. బాలిక బంధువులు ఆగ్రహంతో వైద్యుడి భార్యకు చెందిన ఆస్పత్రిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులు కీచక డాక్టర్‌పై కేసు నమోదు చేశారు. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఈ సంఘటన ఆదివారం తాండూరులో చోటుచేసుకుంది. అసలేం జరిగింది..? మహబూబ్‌నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలానికి చెందిన ఓ బాలిక(14) కొంతకాలంగా తాండూరు పట్టణ ంలోని సోదరి వద్దకు వచ్చి ఉంటోంది. ఆమె కొంతకాలంగా పంటినొప్పితో బాధపడుతోంది. మూడు రోజుల క్రితం బాలిక పట్టణంలోని ప్రైవేట్ వైద్యుడు శెట్టి బస్వరాజ్‌ను ఆశ్రయించింది. రెండు రోజులుగా ఆస్పత్రికి వచ్చిన బాలిక.. పంటినొప్పి తీవ్రమవడంతో కుటుంబ సభ్యులతో కలిసి మరోసారి ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో హాస్పిటల్‌కు వచ్చింది. వైద్యం చేస్తున్న క్రమంలో డాక్టర్ బస్వరాజ్ ఆమెతో తీవ్ర అభ్యంతరకంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక రోదిస్తూ ఆస్పత్రి నుంచి బయటకు పరుగెత్తుకొచ్చింది. కుటుంబీకులకు విషయం తెలిపింది. సమాచారం అందుకున్న బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. అంతలోపు డాక్టర్ పరారయ్యాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన బాలిక బంధువులు డాక్టర్ భార్య నిర్వహిస్తున్న ఆస్పత్రిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సామగ్రిని చిందరవందరగా పడేశారు. పట్టణంలో ఉద్రిక్తత సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆందోళనకారులు పెద్ద ఎత్తున పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో రెండుగంటల పాటు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాలిక ఫిర్యాదు మేరకు డాక్టర్ బస్వరాజ్పై కేసు నమోదు చేసినట్లు అర్బన్ ఇన్చార్జి సీఐ రవి తెలిపారు. వైద్యుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా పలువురు డాక్టర్లు ఠాణాకు చేరుకున్నారు. కేసును రాజీ చేసేందుకు యత్నించి విఫలమయ్యారు. పలు పార్టీలకు చెందిన నాయకులు ఠాణాకు చేరుకొని కీచక డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బస్వరాజ్ భార్య నిర్వహిస్తున్న ఆస్పత్రిపై ఆందోళకారులు దాడి చేయడంతో ఆమె తమకు ఫిర్యాదు చేసిందని, ఈమేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రవి తెలిపారు. కాగా ఉద్దేశపూర్వకంగానే తన భర్తపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని డాక్టర్ బస్వరాజ్ భార్య చెప్పుకొచ్చారు.