కీచక డాక్టర్..! | doctor misbehave with girl who came for dental clinic | Sakshi
Sakshi News home page

కీచక డాక్టర్..!

Published Sun, Jan 19 2014 11:59 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

doctor misbehave with girl who came for dental clinic

తాండూరు రూరల్, న్యూస్‌లైన్: వైద్యో.. నారాయణ హరి! అన్నారు పెద్దలు.. కాని ఓ డాక్టర్ సభ్య సమాజం తలదించుకునే విధంగా చేశాడు. పంటివైద్యం కోసం ఆశ్రయించిన ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించి వైద్యలోకానికి మాయని మచ్చతెచ్చాడు. బాలిక బంధువులు ఆగ్రహంతో వైద్యుడి భార్యకు చెందిన ఆస్పత్రిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులు కీచక డాక్టర్‌పై కేసు నమోదు చేశారు. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఈ సంఘటన ఆదివారం తాండూరులో చోటుచేసుకుంది.

 అసలేం జరిగింది..?
 మహబూబ్‌నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలానికి చెందిన ఓ బాలిక(14) కొంతకాలంగా తాండూరు పట్టణ ంలోని సోదరి వద్దకు వచ్చి ఉంటోంది. ఆమె కొంతకాలంగా పంటినొప్పితో బాధపడుతోంది. మూడు రోజుల క్రితం బాలిక పట్టణంలోని ప్రైవేట్ వైద్యుడు శెట్టి బస్వరాజ్‌ను ఆశ్రయించింది. రెండు రోజులుగా ఆస్పత్రికి వచ్చిన బాలిక..  పంటినొప్పి తీవ్రమవడంతో కుటుంబ సభ్యులతో కలిసి మరోసారి ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో హాస్పిటల్‌కు వచ్చింది.

వైద్యం చేస్తున్న క్రమంలో డాక్టర్ బస్వరాజ్ ఆమెతో తీవ్ర అభ్యంతరకంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక రోదిస్తూ ఆస్పత్రి నుంచి బయటకు పరుగెత్తుకొచ్చింది. కుటుంబీకులకు విషయం తెలిపింది. సమాచారం అందుకున్న బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. అంతలోపు డాక్టర్ పరారయ్యాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన బాలిక బంధువులు డాక్టర్ భార్య నిర్వహిస్తున్న ఆస్పత్రిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సామగ్రిని చిందరవందరగా పడేశారు.

 పట్టణంలో ఉద్రిక్తత
 సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆందోళనకారులు పెద్ద ఎత్తున పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో రెండుగంటల పాటు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాలిక  ఫిర్యాదు మేరకు డాక్టర్ బస్వరాజ్‌పై కేసు నమోదు చేసినట్లు అర్బన్ ఇన్‌చార్జి సీఐ రవి తెలిపారు. వైద్యుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

 ఇదిలా ఉండగా పలువురు డాక్టర్లు ఠాణాకు చేరుకున్నారు. కేసును రాజీ చేసేందుకు యత్నించి విఫలమయ్యారు. పలు పార్టీలకు చెందిన నాయకులు ఠాణాకు చేరుకొని కీచక డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  డాక్టర్ బస్వరాజ్ భార్య నిర్వహిస్తున్న ఆస్పత్రిపై ఆందోళకారులు దాడి చేయడంతో ఆమె తమకు ఫిర్యాదు చేసిందని, ఈమేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రవి తెలిపారు. కాగా ఉద్దేశపూర్వకంగానే తన భర్తపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని డాక్టర్ బస్వరాజ్ భార్య  చెప్పుకొచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement