సాక్షి, న్యూఢిల్లీ : ఆరుషి మృతి కేసులో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. దస్న జైలులోని దంతవైద్య విభాగానికి ఆరుషి పేరు పెట్టాలని నిర్ణయించింది. తల్వార్ దంపతుల కోరిక మేరకు ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు సమాచారం.
నాలుగేళ్ల శిక్షా కాలంలో అధికారులకు విన్నవించి తల్వార్ దంపతులు దంత వైద్య విభాగం నెలకొల్పి... తమ సేవలను అందించారు. అందుకుగానూ రూపాయి ప్రతిఫలం కూడా వారు తీసుకోలేదు. ఈ క్రమంలో జైలు ఆస్పత్రిలోని దంత వైద్యశాలకు తమ కూతురి పేరు పెట్టాలంటూ విడుదల సమయంలో తల్వార్ దంపతులు యూపీ జైళ్ల శాఖ మంత్రి జై కుమార్ సింగ్ జాకీకి విన్నవించుకున్నారు. వారి విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని వైద్యశాలకు ఆరుషి పేరు పెట్టేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు.
మరో పదిహేను రోజుల్లో జైలు అధికారులుగానీ, లేదా తానే స్వయంగా కలిసి సంబంధిత పత్రాలపై తల్వార్ తల్లిదండ్రుల నుంచి సంతకాలు తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు. వారంలో రెండు రోజులపాటు తల్వార్ దంపతులు దస్న జైలును సందర్శించి సేవలు అందిస్తారని జై కుమార్ చెప్పారు. గత వారం అలహాబాద్ హైకోర్టు ఆరుషి హత్య కేసులో సరైన సాక్ష్యాలు లేవని రాజేశ్, నుపుర్ తల్వార్‌లను విడుదలకు ఆదేశించగా.. తమ కూతురి మృతి వెనుక దాగున్న రహస్యాలు బయటపడేదాకా న్యాయ పోరాటం చేస్తామని వాళ్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment