Aarushi Talwar
-
ఆరుషి కోసం అరుదైన పని
సాక్షి, న్యూఢిల్లీ : ఆరుషి మృతి కేసులో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. దస్న జైలులోని దంతవైద్య విభాగానికి ఆరుషి పేరు పెట్టాలని నిర్ణయించింది. తల్వార్ దంపతుల కోరిక మేరకు ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు సమాచారం. నాలుగేళ్ల శిక్షా కాలంలో అధికారులకు విన్నవించి తల్వార్ దంపతులు దంత వైద్య విభాగం నెలకొల్పి... తమ సేవలను అందించారు. అందుకుగానూ రూపాయి ప్రతిఫలం కూడా వారు తీసుకోలేదు. ఈ క్రమంలో జైలు ఆస్పత్రిలోని దంత వైద్యశాలకు తమ కూతురి పేరు పెట్టాలంటూ విడుదల సమయంలో తల్వార్ దంపతులు యూపీ జైళ్ల శాఖ మంత్రి జై కుమార్ సింగ్ జాకీకి విన్నవించుకున్నారు. వారి విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని వైద్యశాలకు ఆరుషి పేరు పెట్టేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. మరో పదిహేను రోజుల్లో జైలు అధికారులుగానీ, లేదా తానే స్వయంగా కలిసి సంబంధిత పత్రాలపై తల్వార్ తల్లిదండ్రుల నుంచి సంతకాలు తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు. వారంలో రెండు రోజులపాటు తల్వార్ దంపతులు దస్న జైలును సందర్శించి సేవలు అందిస్తారని జై కుమార్ చెప్పారు. గత వారం అలహాబాద్ హైకోర్టు ఆరుషి హత్య కేసులో సరైన సాక్ష్యాలు లేవని రాజేశ్, నుపుర్ తల్వార్లను విడుదలకు ఆదేశించగా.. తమ కూతురి మృతి వెనుక దాగున్న రహస్యాలు బయటపడేదాకా న్యాయ పోరాటం చేస్తామని వాళ్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
'మా కూతురు హత్యపై మేమే పుస్తకం రాస్తున్నాం'
న్యూఢిల్లీ: తమ కూతురు హత్యపై ఒక పుస్తకం రాయడం ప్రారంభించామని దేశంలో సంచలనం సృష్టించిన ఆరుషి, పనిమనిషి హేమ్ రాజ్ హత్య కేసులో ప్రధాన నిందితులు ఆరుషి తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్ అన్నారు. ఈ పుస్తకం ద్వారా వాస్తవాలు వెల్లడించాలని అనుకుంటున్నామని, అయితే, ఇది రాస్తున్నప్పుడు చెప్పలేని బాధగా అనిపించి ప్రస్తుతానికి పక్కకు పెట్టామని చెప్పారు. ఆ పుస్తకం పూర్తయితే దానిని చదివిన తర్వాతైన నిజనిజాలు తెలుసుకుంటారని చెప్పారు. తమ కూతురు ఆరుషి హత్య కేసులో ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న వారిని ఓ మీడియా లేఖల ద్వారా ఇంటర్వ్యూ చేసింది. ఆరుషి హత్యపై పుస్తకం వచ్చింది, ఇప్పుడు ఓ సినిమా కూడా వస్తుంది, దీని ప్రభావం మీ కేసుపై ఉంటుందని అనుకుంటున్నారా అని ప్రశ్నించగా.. తాము కూడా జైలులో ట్రైలర్ చూశామని, ఆ చిత్రం రెండు వైపుల ఆలోచించి తీసినట్లు ఉందనిపిస్తుందని, కానీ, దుర్భుద్దితో సీబీఐ చేసిన విచారణ జోలికి వెళ్లనట్లు కనిపిస్తుందని తెలిపారు. ఎవరు ఏం సినిమా తీసినా నిజాలు ఉన్నా లేకున్నా తాము మాత్రం వాస్తవాలతో కూడిన పుస్తకాన్ని రాస్తున్నామని, కొంత బాధతోపాటు ప్రస్తుతం కేసులు, పిటిషన్ల వ్యవహారంతో బిజీగా ఉన్నందున త్వరలో దానిని పూర్తి చేసి నిజనిజాలు వివరిస్తామని తెలిపారు. సీబీఐ పక్షపాతంతో తమపై దర్యాప్తు జరిపిందని తెలిపారు. తమ బాధను ఎవరూ వినడం లేదని, తమ వైపే ఆలోచించకుండా దర్యాప్తు చేసి దోషులుగా సృష్టించారని చెప్పారు. తమ కూతురును కోల్పోయిన బాధలో ఉండగానే కేసులో ఇరికించి ముద్దాయిలుగా సృష్టించారని చెప్పారు. మీకు దేవుడి నమ్మకం ఉంటుందా అని ప్రశ్నించగా.. కొన్ని సార్లు తప్ప ఎక్కువగా నమ్మలేమని, కానీ ఒక విషయం నిజం అని నిరూపించడానికి ముఖ్యంగా విశ్వాసం, ఓపిక అనేవి ఒక వ్యక్తికి ఉండాలని సాయిబాబా చెప్పిన మాటలు నమ్ముతామని అన్నారు. తాము అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశామని, అది ఇంకా విచారణ ప్రారంభం కావాల్సి ఉందని తెలిపారు. -
'ఆ సినిమా చూసేందుకు ఆత్రంగా ఉన్నా'
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్య కేసు నేపథ్యంగా రూపొందించిన 'తల్వార్' చిత్రాన్ని చూసేందుకు తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ అన్నారు. ప్రస్తుతం షాందార్ అనే చిత్రంలో నటిస్తూ ఫుల్ జోష్‌పై ఉన్న షాహిద్ తన చిత్రం కన్నా తల్వార్పైనే ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. 'ఈచిత్రాన్ని ఏ కోణంలో రూపొందించారో అని నేను చాలా ఆసక్తితో ఉన్నాను. నాకు తెలిసి దేశం మొత్తం ఈ సినిమాను చూడాలని ఎదురుచూస్తూ ఉండి ఉంటుంది' అని తల్వార్ చిత్రం గురించి చెప్పారు. 2008లో జరిగిన ఆరుషి తల్వార్ హత్య కేసు ఆధారంగా విశాల్ భరద్వాజ్ తల్వార్ చిత్రానికి దర్శకత్వం వహించారు.