శిశువుతో డాక్టర్ రమ్య
సాక్షి, బెంగళూరు : లాక్‌డౌన్ గర్భిణీలకు శాపంగా మారింది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో ఇంటి నుంచి కాలు బయటపెట్టలేని దుస్థితి ఏర్పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ఓ నిండు గర్భిణీ పురుటి నొప్పులతో బాధపడుతూ.. దాదాపు 7 కిలోమీటర్లు ప్రయాణించి చివరకు ఓ డెంటల్ ఆస్పత్రిలో ప్రసవించింది. చుట్టు పక్కల ఆస్పత్రులు తెరిచి ఉండక పోవడంతో డెంటల్ డాక్టర్లే ఆమెకు పురుడు పోశారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.
(చదవండి : పెళ్లి కోసం 800 కిలోమీటర్ల ప్రయాణం.. చివరికి)
నార్త్ బెంగళూరుకు చెందిన ఒక కార్మికుడు నెలలు నిండిన తన భార్యకు నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దాదాపు 7 కిలోమీటర్లు ప్రయాణం చేసినా ఒక్క ఆస్పత్రి కూడా తెరచి లేదు. నొప్పులు ఎక్కువ కావడంతో చివరకు ఒక డెంటల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అక్కడి డాక్టర్లు ఆమెకు డెలివరీ చేశారు. పుట్టిన శిశువులో చలనం లేకపోవడంతో చనిపోయిందని భావించిన వైద్యులు.. తీవ్ర రక్తస్త్రావం అవుతున్న తల్లిని బతికించేందుకు చికిత్స అందించారు. అయితే అదృష్టవశాత్తు శిశువులో కదలికలు వచ్చాయి. దీంతో తల్లి, బిడ్డలను బెంగళూరులోని ఆస్పత్రికి తరలించారు. లాక్‌డౌన్ కారణంగా అన్ని ఆస్పత్రులు మూసి ఉన్నాయని, గర్భిణీ నొప్పుల బాధను చూడలేక తప్పనిసరి పరిస్థతుల్లో ప్రసవం చేశామని డెంటల్ డాక్టర్ రమ్య అన్నారు. ఇప్పుడు వాళ్లిద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment