
అర్ధరాత్రి నిండు గర్భిణిని ఆసుపత్రికి తీసుకువెళ్తున్న పోలీసులు
బన్సీలాల్‌పేట్: విధుల్లో కాఠిన్యం ప్రదర్శించే పోలీసులు కరుణలో తమకు తామే చాటి అని నిరూపించుకున్నారు. కరోనా విపత్తు వేళ.. ఓ గర్భిణికి అర్ధరాత్రి పురిటి నొప్పులు రావడంతో పోలీసు పెట్రోకారులో ఆసుపత్రికి చేర్చారు గాంధీనగర్ పోలీసులు. వివరాల్లోకి వెళ్లితే.. ఎస్‌బీహెచ్ కాలనీ, ఇందిరాపార్కు ప్రాంతానికి చెందిన అంజమ్మ(21)కు సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో నొప్పులు రావడంతో కుటుంబీకులు 100 నెంబర్‌కు డయల్ చేశారు. సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు పెట్రోకార్– 2 ను అప్రమత్తం చేశారు. ఏఎస్‌ఐ కృష్ణారావు, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రావు ఆదేశాలతో హుటాహుటిన అంజమ్మను తిరుమగిరిలోని మిలటరీ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం అంజమ్మ మగ కవలలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆసుపత్రిలో తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారని సమాచారం. కాగా అంజమ్మ భర్త ఆర్మీలో ఉద్యోగి. పంజాబ్‌లో విధి నిర్వహణలో ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment